
భూమన కరుణాకర్‌రెడ్డి
– భూమనను మళ్లీ రమ్మన్న సీఐడీ
– ఉద్దేశపూర్వకంగానే గొంతునొక్కే ప్రయత్నం
– తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
ప్రతిపక్షాన్ని అన్ని విధాలా అణచి వేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. నోరెత్తి నిలదీసే నేతలను లక్ష్యం చేసుకుని నిర్బంధానికి గురి చేస్తోంది. ప్రజలను చైతన్యవంతం చేసే ఉద్యమాలను అరెస్టులతో అణగదొక్కుతోంది. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి నినదిస్తారో అటువంటి వారిని గుర్తించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిని సీఐడీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తోంది.
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ తిరుపతికి ఓ ప్రత్యేకత ఉంది. ఉద్యమాలు మొదలయ్యేది ఇక్కడి నుంచే. రాజకీయంగా చైతన్యవంతమైన తిరుపతి కేంద్రంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అధికార పార్టీ హామీలను ప్రజలకు వివరించడమే కాకుండా ప్రభుత్వ మోసాలను ఎండగట్టడంలో భూమన కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలో జరిగే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ భూమన పార్టీ శ్రేణులకు సారధ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గొంతు నొక్కడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రతిపక్షనేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తుని ఘటనకు సంబంధించి విచారణ పేరిట భూమనను వేధింపులకు గురిచేయడంతో పాటు ప్రతిపక్ష నేతల్లో భయాందోళనలు నెలకొల్పాలని చూస్తోందని రాజకీయ మేథావులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఇటీవల రాష్ట్ర బంద్ నిర్వహించిన విపక్షనేతలను నిర్ధాక్షిణంగా అరెస్టులు చేయించిన సర్కారు తీరును నిదర్శనంగా పేర్కొంటున్నారు.
భూమనకు రెండోసారి పిలుపు...
తూర్పుగోదావరి జిల్లా తునిలో జనవరి 31నకాపుగర్జన సందర్భంగా విధ్వంస కాండ చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి విచారణకు హాజరు కమ్మని సీఐడీ పోలీసులు ఈ నెల 2న తిరుపతిలో తొలి విడత నోటీసులను భూమనకు అందజేశారు. 6,7 తేదీల్లో గుంటూరు కేంద్రంగా భూమనను సీఐడీ 16 గంటల పాటు విచారించింది. మళ్లీ 19న విచారణకు రమ్మని శనివారం కబురు చేసింది.