నిరుద్యోగులకు చంద్రబాబు దగా
గన్నవరం :
విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య ( ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.లెనిన్‌బాబు పిలుపునిచ్చారు. స్థానిక రాయ్‌నగర్ కళ్యాణ మండపంలో శుక్రవారం జిల్లా 17వ మహాసభ జరిగింది. తొలుత జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఎఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న లెనిన్‌బాబు మాట్లాడుతూ...యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు యువతకు కోటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లదానాన్ని దేశానికి తీసుకువచ్చి పేద కుటుంబాలకు పంపిణీ చేస్తామనే వాగ్ధానాలను కేంద్రం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. యువతకు జాబ్ కావలంటే బాబు రావాలని హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలహామీల్లో ప్రకటించిన నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు దగాకోరు విధానాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల వేదనను గుర్తించి ఖాళీగా లక్ష నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
జయప్రదం చేయండి
ఈ నెల 29, 30, 31 తేదిల్లో ఏలూరులో జరిగే ఎఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ముప్పాల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఇన్‌ఛార్జ్ గడ్డం కోటేశ్వరరావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు సిహెచ్. కోటేశ్వరరావు, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ పాల్గొన్నారు.