వేతనాల్లేవ్!
మార్చి గడుస్తున్నా చేతికందని ఫిబ్రవరి జీతం
రెండు వేల మంది ఉద్యోగుల ఎదురుచూపు
హన్మకొండ అర్బన్: మరో వారం రోజుల్లో మార్చి నెల ముగుస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలోని రెండు వేల మందికి పైగా ఉద్యోగులకు ఫిబ్రవరి నెల వేతనాలు చేతికందలేదు. ఆదాయ పన్నుకు సంబంధించి వివరాలు అందజేయని కారణంగా కొందరి వేతనాలు ఆగితే.. మరికొందరివి ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లులు చేయక ఆగినట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాల బిల్లులు చేసే క్రమంలో ఇన్‌కంటాక్స్ బిల్లుల పేరుతో కార్యాలయాల్లో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేశారు. ఇలాంటి చోట్ల కూడా ఇప్పటివరకు వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో పడకపోవడంతో వారు మండిపడుతున్నారు.
నెలాఖరు వచ్చినా వేతనాలు రాక పోవడం వల్ల బ్యాంకుల్లో గతంలో తీసుకున్న రుణాలకు సంబందించి చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉద్యోగులు అంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ఎస్సీ సంక్షేమ శాఖలో ఉద్యోగులకు వేతనాల బిల్లులు చేసే ఉద్యోగి ఇటీవల ఖమ్మం జిల్లాకు పదోన్నతిపై వెళ్లారు. బదిలీ కంటే ముందే శాఖలో పనిచేసే ఉద్యోగులందరి నుంచి ఇన్‌కంటాక్స్ బిల్లులు, డీటీఓ అధికారుల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.500 తీసుకున్నారు. అనంతరం విధుల నుంచి రిలీవ్ అయి ఖమ్మంలో జాయిన్ అయ్యారు. బిల్స్ చేయలేదు సరికదా.. కొత్తగా చార్జ్ ఇచ్చిన వారికి కనీసం సిస్టం పాస్‌వర్డ్ కూడా చెప్పకుండా వెళ్లాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంలో రెండు రోజుల క్రితం కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారికి విషయం చెప్పి గొడవకు దిగినట్లు సమాచారం. అయినా ఇప్పటి వరకు ఎలాంటి మార్పూ లేదు. ఫిబ్రవరి నెలకు సంబందించి వేతనాలు అందుకోనివారు సుమారు 2వేల మంది వరకు ఉంటారని జిల్లా ఖజానా అధికారి జి.రాజు తెలిపారు. బిల్లుల అందజేయక పోవడం, టైంలోపు ఆదాయపన్ను వివరాలు అందజేయక పోవడం వల్ల వేతనాలు పొందలేక పోయారని తెలిపారు.