అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి
* రౌండ్‌టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీల డిమాండ్
* స్పెషల్ చీఫ్ సెక్రటరీతో ప్రత్యేక బృందాన్ని నియమించాలి
* లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ
గుంటూరు వెస్ట్: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీ నాయకులతో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.. లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీతో ప్రత్యేక బృందాన్ని నియమించాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు, వేలం, రిజిస్ట్రేషన్, ఇతర అన్ని ప్రక్రియలు నిర్వహించడంతోపాటు బాధితులకు పరిహారం ఇచ్చే అధికారాన్ని ప్రత్యేక బృందానికి కట్టబెట్టాలని సూచించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించిన 87 కంపెనీల డైరెక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయని, వీటి నియంత్రణకు 1996లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం అమలు కావడం లేదని చెప్పారు. వైఎస్‌ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోరారు.
అధైర్య పడొద్దు...
వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ వ్యవహారం 20 లక్షల మందికి చెందిన సమస్య అని, దీనిని ప్రజా సమస్యగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 9న విజయవాడ నుంచి వెలగపూడి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌కుమార్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్‌వలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ ప్రసంగించారు.