పరిహారం బాధ్యత ప్రభుత్వానిదే
* సర్కారు ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మార్కెట్లోకి నకిలీలు
* రైతులను తక్షణం ఆదుకోవాలి
* వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
యడ్లపాడు : ప్రభుత్వ ప్రోత్సాహంతోనే నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చాయని, పంట నష్టం బాధ్యతను కూడా ప్రభుత్వమే వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. మండలంలోని సందెపూడిలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తన కంపెనీల లైసెన్సులు రద్దు చేసి, వాటిపై కేసులు పెట్టమని చెబుతున్న వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపించారు. మంత్రి నియోజకవర్గంలోనే కావేరి సంస్థకు చెందిన జాదు నకిలీ విత్తనాల కారణంగా పొలంలోని మొక్కల్ని పీకి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ రైతులకు ఎటువంటి పరిహారం అందకపోవడం విచారకరమన్నారు. మిర్చి రైతుల పరిస్థితి కూడా ఇలానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం చేయాల్సింది నకిలీల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించడమేనని చెప్పారు.
రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆ తర్వాత కంపెనీలపై చర్యలు, వసూలు చేసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గతనెల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని, రబీ సాగుకు సిద్ధమయ్యే రైతులకు వేరుశనగ విత్తనాలను ఉచితంగా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మండలంలోని సొలస, జాలాది, లింగారావుపాలెం, మైదవోలు, యడ్లపాడు, తిమ్మాపురం, దింతెనపాడు, జాలాది, సందెపూడి, గణేశునివారిపాలెం, తుర్లపాడు గ్రామాల్లోని వాగు పరీవాహక ప్రాంతాల్లో పత్తి, మిరప పంటలు వరద ముంపునకు గురయ్యాయన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఎకరాను విధిగా గుర్తించి అ«ధికారులు నష్టపోయిన జాబితాలో చేర్చాలన్నారు. గతేడాది ఇన్‌పుట్ సబ్సిడీ నేటికీ ఇవ్వలేదని, ఈ ఏడాదైనా గతేడాది, ఈ ఏడాది పరిహారం కలిపి తక్షణమే అందజేయాలని కోరారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు కల్లూరి విజయ్‌కుమార్, నాయకులు ఉన్నారు.