పట్టభద్రులూ..ఆలోచించి ఓటు వేయండి
– మూడేళ్లలో ఒక్క హామీని అమలు చేయని టీడీపీ
– సీమ వాణి వినిపించేందుకు వైఎస్‌ఆర్‌సీపీని బలపరచండి
– వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు నదీప్ అహ్మద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మూడేళ్ల పాలనలో ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు నదీప్‌అహ్మద్ పిలుపునిచ్చారు. మార్చి 18న జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలన్నారు. శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, ఇంటికి ఒక ఉద్యోగం, రుణమాఫీ తదితర హామీలను టీడీపీ నాయకులు ఇచ్చారని..అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరిచారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిరంతర పోరాటాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మూడేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదని, పది మందికి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లను అడిగే నైతిక హక్కును టీడీపీ కోల్పోయిందన్నారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యం ఓటుతో గెలిపించాలని కోరారు. రాయలసీమ వాణిని శాసనమండలిలో వినిపించే సత్తా గోపాల్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ.. రియల్ ఎస్టేట్ వ్యాపారిని శాసనమండలికి పంపేందుకు సిద్ధపడడం దారుణమన్నారు. రైతుల భూములను మింగి వ్యాపారం చేసిన వ్యక్తిని పెద్దల సభకు అభ్యర్థిగా నిలబెట్టడం ఆలోచించాల్సిన విషయమన్నారు.
ఉపాధి కల్పనలో విఫలం..
కర్నూలు నియోజకవర్గ సమన్వకర్త హాఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ..మూడేళ్ల టీడీపీ పాలనలో జిల్లాలో ఒక్క పరిశ్రమను స్థాపించలేదన్నారు. ఇప్పుడు మళ్లీ కల్లిబొల్లి హామీలతో నిరుద్యోగులను మోసం చేసేందుకు పరిశ్రమలు స్థాపిస్తామని, ఉపాధిని కల్పిస్తామని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేజేరెడ్డి ముందుకు రావడం దారుణమన్నారు. ఉపాధి కల్పించడంలో సీఎం చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆరోపించారు. ఎక్కడెక్కడ పరిశ్రమలు స్థాపిస్తారో..ఎంతమందికి ఉపాధినికి కల్పిస్తారో చెప్పి.. టీడీపీ నాయకులు ఓట్లు అడగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌ఏ రహ్మెన్, సీహెచ్ మద్దయ్య మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు విజయకుమారి, డీకే రాజశేఖర్, సఫియా ఖాతూన్, ఫైరోజ్, రాఘవేంద్ర, సోయాబ్‌ఖాద్రి, వాహిదా పాల్గొన్నారు.