శుభకార్యానికి వెళ్లి వస్తూ తిరిగి రాని లోకాలకు..
ఇసుక ట్రాక్టర్ ఢీకొని అమ్మమ్మ, మనుమడు మృతి
బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ మరికొద్ది సేపట్లో ఇంటికి చేరిపోతామని అనుకుంటున్న తరుణంలో వారిని మృత్యువు కబళించింది. అప్పటి వరకూ తమతో సంతోషంగా గడపిన వారు ఇక లేరని తెలిసి ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. అందివచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో ఆ తల్లి కన్నీరుమురువుతోంది. ఆమెను ఆపడం ఎవరితరం కావడం లేదు. - కిర్లంపూడి (జగ్గంపేట)
ఇసుక ట్రాక్టర్ ఢీకొని అమ్మమ్మ, మనుమడు మృతి చెందిన సంఘటన కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి గ్రామ శివారున శుక్రవారం జరిగింది. దీనికి సంబంధించి కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శృంగరాయునిపాలెం గ్రామానికి చెందిన కర్రి చిట్టమ్మ(70), మనుమడు ఉల్లి మణి(25)తో కలిసి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి గృహప్రవేశానికి వెళ్లి మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గెద్దనాపల్లి శివారుకు వచ్చేప్పటికి గెద్దనాపల్లి నుంచి కిర్లంపూడి వైపు వెళుతున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో చిట్టెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మనుమడు ఉల్లి మణిని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎస్సై ఆలీఖాన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
గ్రామంలో విషాదఛాయలు
ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో అమ్మమ్మ, మనుమడు మృతి చెందడంతో శృంగరాయునిపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని చలించిపోయారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. సర్పంచ్ వనపర్తి విశాలాక్ష్మి, ఎంపీటీసీలు బొజ్జపు నాగేశ్వరరావు, గూడెపు ఆదినారాయణ, గ్రామ పెద్దలు గొడే బాల, పి.సత్యానందం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతురాలి సోదరుడు ముక్కా జగదీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కిర్లంపూడి ఎస్సై ఎ.బాలాజీ చెప్పారు.