ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
భక్తులతో కి టకిటలాడిన సాయిబాబా మందిరాలు
కోదాడఅర్బన్: పట్టణంలోని పలు ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్‌నగర్‌లోని సాయిబాబా మందిరంతో పాటు కాశీనాధం కల్యాణ మండపం, దుర్గాపురంలోని సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనితతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఆయా ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా పట్టణంలోని శ్రీస్కూల్‌లో గురువుల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా, ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంసల చిత్రపటాలకు పుష్ఫాభిషేకం నిర్వహించి వారి విశిష్టతను విద్యార్ధులకు తెలియజేశారు. పట్టణంలోని రిషి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఈ సందర్భంగా తమ నాట్యగురువు నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా ఆలయాల కమిటీల సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, శ్రీపాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, జ్యోతి, ఎఓ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.