గుప్పుమంటున్న గుడుంబా | gudumba manufacturing in district | Sakshi
Sakshi News home page

గుప్పుమంటున్న గుడుంబా

Published Thu, Jul 7 2016 2:18 AM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM

గుప్పుమంటున్న గుడుంబా - Sakshi

గుప్పుమంటున్న గుడుంబా

బైండోవర్లు చేసినా యథేచ్ఛగా సారా తయారీ
గుడుంబా తయారు చేస్తూ పట్టుబడి.. కేసుల్లో ఇరుక్కున్నా.. నాటుసారా తయారీ మాత్రం ఆగడం లేదు.. విక్రయాలు యథేచ్ఛగా జరుపుతూనే ఉన్నారు. గ్రామాల్లో నాటుసారా కేసులు నమోదు చేసి బైండోవర్లు చేస్తున్నారు. అయినా.. సారా బట్టీలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం తయారీ దారులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. ఆగడం లేదు. నాటుసారా తయారు చేయడాన్ని ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా.. పరిస్థితి యథావిధిగానే ఉంది.

మంచాల మండలంలో పటేల్ చెర్వు తండా, బుగ్గ తండా, బండలేమూర్, సత్తి తండా, ఆంబోత్ తండా, బోడకొండ, దాద్‌పల్లి తండా, వెంకటేశ్వర తంగాల్లో నాటుసారా ఎక్కువగా తయారు చేస్తున్నారు. సారా తయారుకు అలవాటు పడిన గిరిజనులు ఇతర వృత్తులు చేయకుండా.. గుట్టుచప్పుడు గాకుండా గుడంబా తయారు చేస్తూ పరిసర గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు పలుమార్లు దాడులు చేసి, కేసులు నమోదు చేసినా షరా మాములుగానే ఉంతోంది. దీంతో గ్రామాల్లో నాటుసారా విక్రయాలు కొనసాగుతునే ఉన్నాయి. తండాల నుంచి ఆటోలు, జీపులు, మోటారు సైకిళ్లపై నాటుసారా ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లో సారా విక్రయించే వారు గతంలో మాదిరిగా ఇళ్లలో గాకుండా గ్రామాల శివారుల్లో.. ఊరికి దగ్గరలోని మైదాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సారా తాగే వారిని సాయంత్రం వేళ్లలో ఒకచోట కూడగట్టి నిమిషాల వ్యవధిలో లీటర్ల కొద్ది నాటుసారాను విక్రయిస్తున్నారు.

 బైండోవర్లు చేసినా స్పందన శూన్యం
గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయదారులపై కేసులు నమోదు చేసి, బైండోవర్లు చేసినా.. తయారు చేస్తూనే ఉన్నారు. విక్రయాలు జరుపుతూనే ఉన్నారు. మంచాల మండలంలో ఇటీవల మూడు నెలల్లో తహసీల్దార్ శ్యాంప్రకాశ్ ఎదుట 18 మందిని బైండోవర్ చేశారు. 10 మందిపై (ఏఎన్‌టీ), మరో 8 మందిపై 7ఏ కేసులు నమోదు చేశారు. వారందరికీ సారా తయారు చేసినా.. విక్రయించినా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ సరుకులు, ఇతర పథకాలు అందించమని తెలిపారు. అయినా గిరిజన తండాల్లో గుడంబా తయారు చేసి విక్రయిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు ఉక్కుపాదం మోపి.. నాటుసారా విక్రయాలను ఆపాలని ప్రజలు కోరుతున్నారు.

 రూ.50 వేలు జరిమానా..
గతంలో నాటుసారా తయారీ కేసుల్లో బైండోవర్ అయిన వారు మళ్లీ నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ హెచ్చరించారు. వారికి రూ.50 వేలు జరిమానా, జైలుకు పంపడం ఖాయమన్నారు. సారా తయారు చేయవద్దు. గ్రామాల్లో విక్రయించవద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement