అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడి లేని వ్యవసాయానికి (జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్–జెడ్‌బీఎన్‌ఎఫ్) పెద్దపీట వేస్తున్నందున జిల్లాలో ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, డైరెక్టర్ కె.ధనుంజయరెడ్డి, సీఈఓ టి.విజయకుమార్ ఆదేశించారు. మంగళవారం వారు గుంటూరు నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెట్ట వ్యవసాయం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెట్టాలన్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి, పురుగు మందులు లేని వ్యవసాయం(ఎన్‌పీఎం) లాంటి పెట్టుబడి లేని వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో 'అనంత' లాంటి జిల్లాల్లో రైతుల దృష్టిని మళ్లించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 8 మండలాలు, 10 క్లస్టర్లు, 54 గ్రామాల్లో పరిధిలో అమలు చేస్తున్న జెడ్‌బీఎన్‌ఎఫ్ కార్యక్రమాల అమలు గురించి ఆరా తీశారు. పశువుల ఎరువు, గోమూత్రం ద్వారా కషాయాలు వాడి పంటలను సాగు చేయించాలన్నారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. ఇన్‌పుట్ సబ్సిడీ, రబీ పంటల ప్రణాళిక, విత్తన వేరుశనగ పంపిణీ, ప్రధానంగా మట్టి పరీక్షల సేకరణ, విశ్లేషణ, ఇతర వ్యవసాయ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. స్థానిక పెన్నార్ భవన్ సమావేశ మందిరంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, డీడీఏలు, డివిజన్ ఏడీలు, టెక్నికల్ ఏఓలు పాల్గొన్నారు.
పెట్టుబడి లేని వ్యవసాయానికి పెద్దపీట
Published Tue, Nov 29 2016 10:37 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement