సిండికేట్ బ్యాంక్ వద్ద మహిళ హల్‌చల్
సిండికేట్ బ్యాంక్ వద్ద మహిళ హల్‌చల్
Published Thu, Feb 16 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
బ్యాంక్ ప్రవేశ ద్వారానికి తాళం వేసిన వైనం
పోలీసుల రంగ ప్రవేశంతో కథ సుఖాంతం
పగిడ్యాల: స్థానిక సిండికేట్ బ్యాంక్ ప్రవేశ ద్వారానికి ఓ మహిళ తాళం వేసి అరగంటకుపైగా లావాదేవీలు నిలిచిపోయేలా చేసిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెస్త శేషమ్మకు స్థానిక సిండికేట్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. తన ఖాతాకు పాస్టర్లు రూ.2 లక్షలు జమ చేశారని వాటిని విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అయితే చివరకు తాళం వేసి అక్కడి నుంచి ఉడాయించింది. ఘటనపై బ్యాంకు సిబ్బంది ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ బ్యాంక్ వద్దకు చేరుకుని ఖాతాదారులతో తాళం పగులగొట్టించాడు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులను బ్యాంక్ అధికారులు ఎందుకు తీస్తున్నారని తమ అనుమతి తీసుకోకుండా ఫొటోలు తీయడం సరికాదని వారించే ప్రయత్నం చేశారు. శేషమ్మకు మానసిక స్థిమితం లేదని, అందుకే తాళం వేసిందన్నారు. ఆమె ఖాతాకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లు ఇస్తామని, ఆమె ఖాతాలో ఎవనై డబ్బు జమ చేయలేదని, పత్రికల్లో రాయొద్దని బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నరసింహులు, మేనేజర్ వెంకటరాముడులు కోరడం గమనార్హం. తర్వాత బ్యాంక్ కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించకుండా ఏఎస్‌ఐ అబ్దుల్‌అజీజ్ బందోబస్తుకు కానిస్టేబుల్‌ను నియమించారు.
Advertisement