జోగిపేట: ఈ నెల 6వ తేదిన జోగిపేట పట్టణంలో హమాలీ సంఘం జిల్లా మహాసభలను నిర్వహించనున్నట్లు సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మొగులయ్య అన్నారు. మంగళవారం జోగిపేట మార్కెట్ యార్డు ఆవరణలో హమాలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డుల్లో పని చేస్తున్న హమాలీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ఈ మహాసభల్లో రూపొందించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ర్టంలో 100కుపైగా గోదాములను నిర్మించినా ప్రభుత్వం వాటిలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో హమాలీలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హమాలీలకు కనీస వేతనం, ఉద్యోగభద్రత, ప్రమాదబీమా, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, వారి పిల్లలకు కార్పొరేట్ ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. జోగిపేటలో జరిగే మహాసభలకు హమాలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జోగిపేట హమాలీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్తెయ్య, నర్సింలు, నాయకులు మాణయ్య, శ్రీనివాస్, వెంకట్, పోచయ్య పాల్గొన్నారు.