-
ఫైళ్ల పంపకాలు షురూ
-
కలెక్టర్ పర్యవేక్షణలో చురుగ్గా పనులు
ఖమ్మం: ‘కొత్త’ కదలిక జోరందుకుంది. కార్యాలయ భవనాల ఎంపిక, అధికారుల క్వార్టర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే.. కీలక దశ అయిన దస్త్రాల విభజన శ్రీకారం చుట్టుకుంటోంది. ‘ఉమ్మడి’ ఖమ్మం నుంచి ‘గూడెం’ జిల్లా ‘వేరు’బడుతుండడంతో ఫైళ్ల పంపకాలు చేసేస్తున్నారు. సిబ్బంది కేటాయింపు జాబితా రూపొందిస్తున్నారు. ప్రస్తుత కలెక్టరేట్‌లోని ఓఎస్‌డీ, ఎంహెచ్‌సీ, లీగల్‌సెల్, ఐటీ, ఎన్నికల విభాగాలు విడిపోనున్నాయి. ఉద్యోగులతో పాటు వాటా కింద వాహనాలు, ఫర్నిచర్ తరలిపోనున్నాయి. దసరా పండగ నుంచి సరి‘కొత్త’ పాలనకు చకచకా పనులు సాగుతున్నాయి.
కొత్తగూడెం జిల్లా ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో విభజన మొదలైంది. అన్ని శాఖల ఫైళ్లు విభజిస్తుండగా, రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా నుంచే కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో పాలన నిర్వహించాలని ఆదేశించడంతో..కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రత్యేక దృష్టితో ఉన్నతాధికారులకు ఫైళ్ల పంపిణీపై దిశానిర్దేశం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.శ్రీనివాస్ పర్యవేక్షణలో కలెక్టరేట్‌లోని ప్రధాన విభాగాల దస్త్రాలను వేరు చేయిస్తున్నారు. ఇక్కడ పూర్తి కాగానే..మిగతా శాఖల్లో చేపట్టనున్నారు.
‘ఇల్లెందు’వైపు కొంత..‘కొత్త’గా అంతా..
ఖమ్మం జిల్లాలోని ఫైళ్లను కొత్తగూడెం జిల్లాలోకి వచ్చే మండలాలకు సంబంధించినవి వేరుగా సిద్ధం చేస్తున్నారు. వరంగల్ నుంచి కొత్తగా ఏర్పడుతున్న మహబూబాబాద్ జిల్లాలోకి ఇల్లెందు నియోజకవర్గం నుంచి గార్ల, బయ్యారం కలవనున్న తరుణంలో..ఆయా మండలాల ఫైళ్లను కూడా విభజిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కలెక్టరేట్‌లోని ఏ, బీ, ఓఎస్‌డీ ,ఎంహెచ్‌సీ, లీగల్‌సెల్, ఐటీ, ఎలక్షన్ విభాగాల దస్త్రాలను విడదీస్తున్నారు.
ప్రతి విభాగం..కానుంది ప్రత్యేకం
– ప్రస్తుతం కలెక్టరేట్‌లో ‘ఏ సెక్షన్‌లోని ఉద్యోగుల బదిలీ, పోస్టింగ్, రీయింబర్స్‌మెంట్లను వేరు చేస్తున్నారు.
– బీ సెక్షన్‌లో భూముల వివరాలు, ఆర్‌ఓఆర్, ల్యాండ్ డిస్పుట్స్, ల్యాండ్ ఎలాట్‌మెంట్ దస్త్రాలు విభజిస్తున్నారు.
– ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు.
– ఎంహెచ్‌సీ సెక్షన్‌లో (మెజిస్టీరియల్ హెడ్ క్లర్క్), స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల వివరాలు, సినిమాహాళ్లు, గన్‌లైసెన్స్ వివరాల జాబితాలు రూపొందిస్తున్నారు.
– ఓఎస్‌డీ సెక్షన్‌లో ప్రకృతి వైపరీత్యాలు, భూమి శిస్తులు, ఆరోగ్యశ్రీ, ఆపద్బంధు, క్యాస్ట్ ఎంక్వయిరీ, జమాబందీ తదితర అంశాలను వేరు చేస్తున్నారు.
– ఎలక్షన్, ఐటీ, లీగల్ సెల్ విభాగాలను రెండు వైపులా విడదీస్తున్నారు.
సమీక్షలు..పర్యవేక్షకులు
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల్లో, మరుగుదొడ్ల నిర్మాణాల్లో జిల్లా అగ్రభాగంలో ఉంది. ఇదే ఒరవడిని జిల్లాల పునర్విభజనలోనూ కొనసాగించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇటీవల కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు సూచించారు. దీంతో..కలెక్టర్ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పనుల వేగవంతంపై దిశా నిర్దేశం చేస్తున్నారు. ఏడుగురు జిల్లా అధికారులను విభజన పర్యవేక్షుకులుగా నియమించి ప్రక్రియను వేగిరం చేస్తున్నారు.
ఒరిజినలా..? జిరాక్సులా..?
– పునర్విభజనలో భాగంగా రెండు జిల్లాల మండలాల ఫైళ్లను వీడదిస్తున్న క్రమంలో..కొత్తగూడెం జిల్లాకు ఒరిజినల్ ఫైళ్లను పంపాలా..? లేక జిరాక్సు ప్రతుల దస్త్రాలను పంపాలా..? అనే అంశంపై స్పష్టత లేదు.
– ప్రస్తుతానికైతే..అన్ని ఫైళ్లను స్కానింగ్ చేస్తున్నారు.
– మండలాల వారీగా అన్నీ వేరు చేసి ఉంచుతున్నారు.
– కొత్త మండలాల ఏర్పాటు ఉహాగానాలు వస్తుండడంతో..దస్త్రాలను ఉంచనున్నట్లు తెలిసింది.