కుప్పం కోసమే హంద్రీనీవా విస్తరణ
కుప్పం కోసమే హంద్రీనీవా విస్తరణ
Published Sun, Jan 29 2017 12:01 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
– జిల్లాలో చెరువులకు నీరు నింపిన తరువాతే కిందికి ఇవ్వాలి
– లేని పక్షంలో విస్తరణ పనులను అడ్డుకుంటాం
– 106 చెరువులు ప్రతిపాదనను పక్కన పెట్టారు
– వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించేందుకే హంద్రీ నీవా విస్తర్ణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని వైఎస్‌ఆర్‌సీపీ జల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాలుగా దగా పడ్డ రాయలసీమకు కృష్ణ జలాలు అందించి బంగారు పంటలు పండించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆ సమయంలో ఈ పథకాన్ని అడ్డుకనేలా తెలంగాణ టీడీపీ నేతలు, ఆంధ్రాకు చెందిన ఇప్పటి మంత్రి దేవినేఽని ఉమతో ఆందోళన చేయించిన ఘనత చంద్రబాబు అని గుర్తు చేశారు.
1996లో, 1999లో ఈ పథకానికి శంకుస్థాపన చేసిన ఆయన పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. జలయజ్ఞంలో భాగంగా మహానేత కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలో 6.025 లక్షల ఎకరాలకు శ్రీశైలం వెనుకటి జలాలను వరద రోజుల్లో 40 టీఎంసీలు తరలించాలనే ఉద్దేశంతో రూ. 6850 కోట్లతో పనులు ప్రారంభించారన్నారు. రూ. 4340.40 కోట్లు ఖర్చూ చేసి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన 20 శాతం పనులు ఏడేళ్లైనా నేటీకి పూర్తి కాలేదని విమర్శించారు.
చెరువులు నింపరు.. పంట కాల్వలు పూర్తి చేయరు
ఽహంద్రీనీవా పథకంలో భాగంగా చెరువులను నింపి పంట కాల్వలు నిర్మించి రైతులకు సాగునీరు అందించాల్సి ఉండగా ఇంత వరకు పనులు పూర్తి కాలేదని విమర్శించారు. హంద్రీనీవా కాలువ నుంచి జిల్లాకు 6 టీఎంసీలు సాగుకు, 1 టీఎంసీ నీరు తాగు నీటికి ఇవ్వాల్సి ఉందన్నారు. 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉండగా 13,500 ఎకరాలకు మించి ఇవ్వడం లేదన్నారు. పందికోన రిజర్వాయర్ కింద 65 వేల ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉండగా మూడేళ్లవుతున్న పంట కాల్వలు నిర్మించలేదన్నారు.
అలాగే హంద్రీ నీవా నీటితో జిల్లాలో 106 చెరువులకు నీరు నింపేందుకు రూ.890 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి ఏడాదవుతున్నా ఇంత వరకు పైసా నిధులు ఇవ్వలేదన్నారు. సీఎం నియోజకవర్గానికి నీరు తరలించేందుకు 35 అడుగులు ఉన్న ప్రధాన కాల్వను 50 అడుగులకు విస్తరించేందుకు రూ. 1200 కోట్లతో అంచనాలు వేశారు. ఈ ప్రతిపాదన కంటే ముందుగానే చెరువులు నింపేందుకు పంపిన ప్రతిపాదనను ఎందుకు పక్కన పెట్టేశారన్నారు. చెరువులు నింపేందుకు కేటాయింపులు లేవని సీఈ లేఖ రాసినా టీడీపీ నేతలు స్పందించక పోవడం దారుణమన్నారు. జిల్లాలోని చెరువులను నింపిన తర్వాతే ఇతర జిల్లాలకు నీటిని మళ్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు భిన్నంగా విస్తరణ పనులను చేపడితే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.
Advertisement