హంద్రీనీవా పంపుల ద్వారా కేసీకి నీటి విడుదల
– రెండు పంపుల ద్వారా 670 క్యుసెక్కుల నీరు
– ఏట్టకేలకు ఫలించిన కేసీ రైతుల పోరాటం
కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం మాల్యాల పంపు నుంచి రెండు పైపుల ద్వారా మంగళవారం కేసీ కెనాల్‌కు నీటిని విదుదల చేశారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. దీంతో కేసీ ఆయకట్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా సాగునీటి ఇబ్బందులు వచ్చాయి. హంద్రీనీవా నుంచి రెండు పైపుల ద్వారా కృష్ణా జలాలను మళ్లిచాలని 2014లో చేసిన ప్రతిపాదనపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, కేసీ రైతులు భారీ ఎత్తున పోరాటాలు చేశారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. హంద్రీనీవా నుంచి రెండు పంపులు ద్వారా నీరు కేసీకి మళ్లించేందుకు శరవేగంగా పనులు చేపట్టి గత నెలలో పూర్తి చేసి ట్రయల్ రన్ చేశారు. వర్షం రావడంతో ఇంత వరకు ఆయకట్టుకు నీరు ఇచ్చారు. ఎగువ నుంచి నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో ఇటీవలే కేసీకి నీటిని బంద్ చేశారు. దీంతో పంటల స్థితిని దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవా సుజల స్రవంతి పథకం మాల్యాల లిఫ్ట్ నుంచి రెండు పంపుల ద్వారా 670 క్యుసెక్కుల నీటిని వదిలారు. ఈ నీరు 150 కి.మీ వరకు ఉన్న ఆయకట్టుకు అందుతుంది. 0నుంచి 67కి.మీ(మాల్యాల లిఫ్ట్ వరకు) వరకు ఉన్న ఆయకట్టుకు సుంకేసుల బ్యారేజీ నుంచి కలెక్టర్ ఆదేశాలతో 505 క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు.