చేతులెత్తేశారు!
‘ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులకు’ బ్రేక్
- కార్పొరేషన్ పరిధిలో రేషన్ షాపు నిర్వాహకుల ససేమిరా
- కోటా కార్డులకే సరుకులిస్తామని స్పష్టం
- ఇతరులకు ఇవ్వలేమని తేల్చిన వైనం
- వలస కుటుంబాలకు తప్పని అవస్థలు
- 28 షాపులకు అధిక రేషన్ కోటా ఇవ్వండి
- ప్రభుత్వాన్ని కోరిన జిల్లా జాయింట్ కలెక్టర్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రేషన్ సరుకులు ఏ రేషన్ దుకాణంలోనైనా తీసుకునేందుకు ఉద్దేశించిన ఈ–పాస్ విధానం అమలుకు బ్రేక్ పడుతోంది. నిర్ణీత కోటా కార్దుదారులకు మించి రేషన్ కోసం ఇతర ప్రాంతాల వారు వస్తుండటంతో తమ పరిధిలోని కార్డుదారులకు చివరకు సరుకులు లేకుండా పోతున్నాయని కొద్ది మంది రేషన్‌షాపు యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి పరిధిలోని కార్డుదారులకు వారే రేషన్ ఇవ్వాలని... వేరే షాపునకు వస్తే సరుకులు ఇవ్వమని తేల్చి చెప్పేందుకు రేషన్‌షాపు యాజమాన్యాలు నిర్ణయించాయి. వాస్తవానికి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ–పాస్ విధానంలో కుటుంబంలోని సభ్యులు ఎవరైనా వేలిముద్రలు వేసి రాష్ట్రంలోని ఏ రేషన్‌షాపు నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, తాజాగా రేషన్‌షాపు యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంతో ఎక్కడైనా రేషన్ విధానానికి బ్రేకులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుదారుల అధిక రద్దీ ఉన్న షాపులకు అదనపు కోటా సరుకులను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) సీహెచ్ హరికిరణ్ కోరారు.
మా కార్డులకే రేషన్
జిల్లాలో 11 లక్షల 52 వేలకుపైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు రేషన్ సరుకులను సరఫరా చేసేందుకు వీలుగా 2,414 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ–పాస్ విధానం అమలుతో జిల్లాలో ఏ కార్డుదారైనా ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కలిగింది. గ్రామాల్లో రేషన్‌కార్డులు ఉండే అనేక మంది కూలీ కోసం పొట్టచేతబట్టుకుని కర్నూలు నగరానికి వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ–పాస్ విధానం అమలుతో ప్రధానంగా బతికేందుకు వలస వచ్చిన కుటుంబాలు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లో ఉండే షాపులల్లోనే రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. అయితే, వీరు ముందుగానే రేషన్ సరుకులు తీసుకోవడంతో ఆ షాపు పరిధిలో ఉండే కార్డుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరికి సరుకులు కాస్తా మిగలడం లేదు. ఫలితంగా వీరు రేషన్‌షాపు డీలర్లతో వాదనకు దిగుతున్నారు. ప్రధానంగా కార్పొరేషన్ పరిధిలోని 28 రేషన్‌షాపులల్లో ఈ సమస్య ప్రధానంగా ఉంది. దీంతో వీటికి అదనపు కోటా రేషన్ సరుకులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని జేసీ కోరారు.
అదనపు కోటా ఇవ్వండి
ప్రధానంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 28 షాపుల్లో సరఫరా చేసిన కోటాకు మించి రేషన్‌దారులు సరుకుల కోసం వస్తున్నారని అధికారులు లెక్క తేల్చారు. గత మూడు నెలల కాలాన్ని పరిగణలోనికి తీసుకుని ఎక్కడైతే కార్డులకు మించి సరుకులు కావాలనే డిమాండ్ ఉందో.. అలాంటి షాపులను గుర్తించారు. ఈ విధంగా ఎంపిక చేసిన 28 రేషన్ షాపులకు అదనపు కోటా సబ్సిడీ సరుకులకు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) సీహెచ్ హరికిరణ్ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు తాజాగా లేఖ రాశారు. ఇందుకు ప్రభుత్వం స్పందించి అదనపు కోటా సరఫరా చేస్తే ఈ–పాస్ విధానం అమలుకు ఇబ్బంది తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది. లేనిపక్షంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఈ–పాస్ విధానం అమలుపై నీలినీడలు కమ్ముకోనున్నాయి.
ప్రభుత్వాన్ని కోరాం
జిల్లాలో కొన్ని రేషన్‌షాపుల వద్ద ఈ–పాస్ విధానంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. దీంతో ఆయా షాపుల పరిధిలోని కార్డుదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారని సమాచారం అందింది. అందువల్ల ఈ విధంగా సమస్యలున్న 28 రేషన్‌షాపులకు అదనపు కోటా సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. అనుమతి వచ్చిన వెంటనే ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– హరికిరణ్, జాయింట్ కలెక్టర్