
మార్మోగిన హనుమాన్ నామస్మరణ
ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం హనుమద్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
- వైభవంగా హనుమద్ జయంతి
- కసాపురంలో పోటెత్తిన భక్తులు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం హనుమద్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ ఈఓ ఆనంద్‌కుమార్, అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఇతర పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో సీతారామ లక్ష్మణసహిత ఆంజనేయ స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి సర్వాంగసుందరంగా ముస్తబు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. ఆలయ ఏఈఓ మధు, పాలకమండలి సభ్యులు జగదీష్ ప్రసాద్, సతీష్, చెల్లూరు నరసింహులు, తలారి రామలింగ, మహేష్, కందుల ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.