వర్షం..హర్షం
వర్షం..హర్షం
Published Thu, Sep 15 2016 8:37 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– జిల్లాలో భారీ వర్షం
– ఆదోని డివిజన్‌పై కరుణ చూపిన వరుణుడు
– దేవనకొండలో 116.6, ఆదోనిలో 99.8 మి.మీ. వర్షపాతం నమోదు
– రబీ పంటల సాగుకు అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్): నెలన్నర రోజుల తర్వాత జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మొన్నటి వరకు ఆదోని రెవెన్యూ డివిజన్ వర్షాలు లేక నిరీక్షించిన రైతులను వరుణుడు కరుణించాడు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఆదోని డివిజన్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దేవనకొండలో ఏకంగా 116.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మొదటిసారిగా 54 మండలాల్లోను వర్షాలు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు 43.6 మిమీ వర్షపాతం నమోదైంది. జూన్, జులై నెలల్లో వేసిన వేరుశనగ, కొర్ర,మొక్కజొన్న వంటి పంటలు వర్షాభావంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి, కంది వంటి పంటలకు ఈ వర్షాలు తోడ్పడుతున్నాయి. ముఖ్యంగా రబీ సీజన్‌కు వర్షాలు బాగా ఉపయోగపడుతాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
46 మండలాల్లో 10మి.మీ. పైనే...
బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. 46 మండలాల్లో 10 మి.మీ. పైగా వర్షపాతం నమోదైంది. గడివేముల, మిడుతూరు, కొత్తపల్లి, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, ఆత్మకూరు, పగిడ్యాల, శ్రీశైలంలో మాత్రమే ఒక మోస్తరు వర్షాలు పడగా మిగిలిన అన్ని మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 80.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదోని డివిజన్‌లో వర్షాలు పడటంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంటోంది. రెయిన్‌గన్‌లతో నిన్న, మొన్నటి వరకు కుస్తీ పడ్డారు. వర్షాలు పడటంతో రెయిన్‌గన్‌లతో పని లేకపోవడంతో అధికారులు ఉపశమనం పొందుతున్నారు.
ఉల్లి రైతు కంట కన్నీరు:
ఖరీఫ్ సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు ఉండగా 5.28 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. వేరుశనగ, కొర్ర, పత్తి, ఆముదం, కంది వంటి పంటలు ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్‌లోనే ఎక్కువగా ఉంది. కంది రికార్డు స్థాయిలో 93,620 హెక్టార్లలో సాగు కాగా పత్తి 1,49,944హెక్టార్లలో సాగు అయింది. వేరుశనగ 1,15,627 హెక్టార్లు, మొక్కజొన్న 25,932, ఉల్లి 22, 727, కొర్ర 10, 444, మినుము 12,734, మిరప 19,141 హెక్టార్లలో వేశారు. వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న వంటి పంటలు ఇప్పటికే దెబ్బతినగా మిగిలిన పంటలు ఈ వర్షాలతో కోలుకుంటున్నాయి. అయితే వర్షాలతో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా ప్రాంతాల్లో ఉల్లి చేతికందడంతో పెరికి ఆరబెట్టారు. నిన్నటి వరకు తేలికపాటి వర్షాలు పడుతుండటం, తాజా భారీ వర్షాలు పడటంతో ఉల్లి పంట నీట మునిగింది. దేవనకొండ, గోనెగండ్ల, ఆదోని, కోడుమూరు, వెల్దుర్తి, క్రిష్ణగిరి తదితర మండలాల్లో ఉల్లి నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే ధరలు పడిపోగా నీట మునిగిన పంట నాణ్యత దెబ్బతిని ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
Advertisement
Advertisement