వేధింపులు.. బెదిరింపులు
-
పార్టీ మారకపోతే కేసుల్లో ఇరికిస్తామంటూ హెచ్చరికలు
-
నేరుగా పోలీసు అధికారుల ఒత్తిళ్లు
-
వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు
-
వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపిన మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సవాల్
సాక్షి, గుంటూరు : పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకో.. దాచుకో అన్నచందంగా గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేత అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తన, మన భేదం లేకుండా సొంత పార్టీ నేతలకు చెందిన మద్యం దుకాణాలు, సున్నపు బట్టీల వద్ద సైతం భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారు. సొంత భూములు ఉన్నవారి వద్ద నుంచి మైనింగ్ లైసెన్సులను సైతం లాగేసుకుని అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. దీనిపై స్పందించిన లోకాయుక్త విచారణ జరిపి అక్రమ మైనింగ్ వాస్తవమేనంటూ నిర్ధారించింది కూడా. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారుల్లో చలనం లేకపోవడం దారుణమైన విషయం. మరోపక్క పలువురు పోలీసు అధికారులు ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. పార్టీ మారకపోతే తప్పుడు కేసులు పెడతామంటూ నేరుగా పోలీసు అధికారులే బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను ఇదేవిధంగా బలవంతంగా టీడీపీలో చేరేలా ఒత్తిళ్లు చేశారు.
తప్పుడు కేసులు, బెదిరింపులు..
అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన గురువాచారిని సైతం తప్పుడు కేసుల్లో ఇరికించిన అధికార పార్టీ నేతలు.. పోలీసుల ద్వారా ఆయన్ను నాలుగు రోజులపాటు ఎవరికి కనిపించకుండా చేసి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడి చివరికి పార్టీ కండువా కప్పేశారు. గ్రామాల్లో అధికార పార్టీపై సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో రగిలిపోతుండటంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ నుంచి గ్రామ స్థాయి నాయకులు వలసలు వస్తున్నారంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకునేందుకు పథక రచనలు చేస్తున్నారు. ఇప్పటికే పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో అనేక గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వేధింపులు తట్టుకోలేక ఇష్టం లేకున్నా పలువురు పచ్చ జెండా కప్పుకొంటుండగా, అనేక గ్రామాల్లో మాత్రం ఎన్ని వేధింపులకు గురిచేసినా తాము వైఎస్సార్‌సీపీని వీడేది లేదంటూ కరాఖండీగా చెబుతుండటంతో అధికార పార్టీ నేతకు దిక్కుతోచడం లేదు.
అంతర్మథనంలో టీడీపీ శ్రేణులు..
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్లు, రోడ్ల నిర్మాణాల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని, ఆ విషయాన్ని ఆధారాలతో రుజువు చేస్తానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పల్నాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. ఇప్పటివరకు గ్రామాల్లో భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధపడితే తాను గురజాల నుంచి పోటీ చేస్తానని, ఎవరు ఓడినా రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ ఎమ్మెల్యే పీఆర్కే సవాల్ విసరడం పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపింది. దీనిపై యరపతినేని వెనకడుగు వేస్తుండటంపై టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పుడున్న పరిస్థితుల్లో గురజాల నియోజకవర్గంలో గెలవడం సాధ్యమైన పని కాదని టీడీపీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 29న నడికుడి మార్కెట్ యార్డుకు వచ్చి యరపతినేని అవినీతి బాగోతాన్ని బయటపెడతానని ప్రకటించిన ఎమ్మెల్యే పీఆర్కే.. అందుకు సిద్ధమవుతుండటంతో దీన్ని నుంచి బయటపడేందుకు పోలీసుల ద్వారా పథక రచన చేస్తున్నట్లు తెలిసింది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే సాకుతో ఎమ్మెల్యే పీఆర్కేను, వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించే ఆలోచనలో ఎమ్మెల్యే యరపతినేని ఉన్నట్లు సమాచారం.