అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు
♦ ఫాంహౌస్‌లలో అనైతిక చర్యలు
♦ తరచూ ఘటనలు
♦ తాజాగా వ్యభిచారం చేస్తూ పట్టుబడిన
♦ హైదరాబాద్ యువకులు
పరిగి: అసాంఘిక కార్యకలాపాలకు ఫాంహౌస్‌లు అడ్డాలుగా మారుతున్నాయి. డివిజన్ పరిధిలోని పూడూరు, పరిగి పరిసరాల్లో దాదాపు 200-250 ఫాంహౌస్‌లు ఉన్నాయి. నగరానికి ఈ ప్రాంతం చేరువగా ఉండడంతో జల్సారాయుళ్లు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. నగరంలో అయితే పోలీసుల దాడులు జరుగుతాయని భావించి నగరానికి దూరంగా ఉన్న ఈ ఫాంహౌస్‌లను సురక్షిత ప్రాంతాలుగా భావించి ఇక్కడికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున పూడూరు మండలంలోని మీర్జాపూర్ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పోలీసులు దాడి చేసి వ్యభిచారం చేస్తున్న నలుగురు యువకులు, నలుగురు యువతులతో పాటు ఫాంహౌస్ నిర్వాహకుడిని అరెస్టు చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. నగర శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లలో అసాంఘిక కార్యకలపాలకు పోలీసులు అడ్డుకట్ట వేయడంతో అక్రమార్కుల కన్ను పరిగి ప్రాంతంలోని ఫాంహౌస్‌లపై పడినట్లు తెలుస్తోంది.
భారీగా ఫాంహౌస్‌లు..
రియల్ భూ సమయంలో బడా బాబులు పరిగి, పూడూరు తదితర మండలాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఫాంహౌస్‌లు ఏర్పాటు చేసుకొని పలు రకాల తోటలు పెంచుకుంటున్నారు. కొందరు ఫాంహౌస్‌లలో విలాసవంతమైన భవనాలను నిర్మించుకొని అందులో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా పెద్దఎత్తున ప్రహరీలు, కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు పోలీసులను కూడా తమ ఫాంహౌస్‌లలోకి అనుమతించడం కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఆందోళనలో స్థానికులు...
మంచికి, మానవత్వానికి మారుపేరైన పల్లె వాతావరణం కలుషితమవుతోంది. ఫాంహౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు వెలుగుచూడడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యవహారాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఆవేదనకు గురవుతున్నారు. ఫాంహౌస్‌లపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిన జంటల తాకిడి..
సిటీలో నిత్యం పని ఒత్తిడి, కలుషిత వాతావరణంలో గడిపే నగర వాసులు సెలవు దినాల్లో వారానికి ఒకటిరెండు రోజులు వచ్చి ఫాంహౌస్‌లలో సేద తీరుతున్నారు. అయితే, ఇటీవల కొన్ని ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫాంహౌస్‌లకు జంటల తాకిడి బాగా పెరిగిందని, స్థానికులు వారెవరనే విషయంపై ఆరా తీయడానికి వెళ్తే వాళ్లు వాహనాల్లో పారిపోతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫాంహౌస్‌ల నిర్వాహకులు కొందరు డబ్బులకు ఆశపడి అసాంఘిక కార్యకలాపాలకు కిరాయికి ఇస్తున్నట్లు సమాచారం. గతంలో పరిగి మండల పరిధిలోని తొండపల్లి సమీపంలో, పూడూరు మండల పరిధిలోనూ పలు ఘటనలు వెలుగుచూశాయి.