అమిత్ షా నీతులు చెప్పాల్సిన అవసరం లేదు
మంత్రి హరీశ్‌రావు
భూపాలపల్లి: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండేళ్లలో కేంద్రం చేసిందేమీ లేదని, బీజేపీ నేత అమిత్‌షా నీతులు చెప్పాల్సిన అవసరం లేదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్పీకర్ సి.మధుసూదనాచారి శాసన సభాపతిగా ప్రమాణ స్వీకారం చేసి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణపై కేంద్రానికి ఏ మాత్రం ప్రేమ లేదన్నారు. ఈ ప్రాంతంలోని ఆరు మండలాలను ఆంధ్రాలో కలిపి తెలంగాణ వచ్చిన సంతోషం కూడా లేకుండా చేసిందన్నారు. 365 రోజులు ఉచితంగా కరెంటును అందించే లోయర్ సీలేర్ కరెంటును ఆంధ్రాకు అప్పగించి అన్యాయం చేసిందని ఆరోపించారు.
ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. తెలంగాణలోని కాళేశ్వరం, ప్రాణహితను పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. దేశ విదేశాల్లో తిరుగుతున్న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో ఒక్కసారి కూడా పర్యటించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రాలు విడిపోయినా హైకోర్టును ఎందుకు విభజించడం లేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందే నిజమైతే.. ఢిల్లీ, బిహార్, తమిళనాడులో ఆ పార్టీ ఎందుకు పరాజయం పాలైందని ప్రశ్నించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కరెంటు విషయమై అమిత్‌షా సూర్యాపేట ప్రజలను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, తమ ప్రభుత్వం గిరిజన గూడాల్లో సైతం 24 గంటల కరెంట్ అందిస్తుందన్నారు. సీఎం చంద్రశేఖరరావు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌లో మెచ్చుకుంటుంటే అమిత్‌షా ఇక్కడికి వచ్చి ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సభలో మంత్రులు పోచారం, చందూలాల్ పాల్గొన్నారు.