మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా బాలుడితండ్రికి ఆర్థికసాయం అందజేస్తున్న దృశ్యం
అమీర్‌పేట: వింత వ్యాధితో బాధపడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన చిన్నారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చారు. వైద్యానికి డబ్బులు లేక బాధిత కుటుంబసభ్యులు పడుతున్న అవస్థలపై ‘సాక్షి’ దినపత్రికలో ‘పాపం పసివాడు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థల యాజమాన్యం అతడికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా తాళ్లగడ్డకు చెందిన షఫీ, మున్సీసాల దంపతుల జానీ(6) రక్త సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు.
దీనిపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థల అధినేత మట్టుపల్లి మోహన్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా రూ.3.60లక్షల చెక్కును బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ జోనల్ అడ్మిన్ ప్రిన్సిపాల్స్ ఎస్.ఎమ్.వలి,ఎస్.వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ..
బ్లడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా బాలుడి మొఖంపై పగుళ్లు, కురుపులు వచ్చి చీము, రక్తం కారుతుందన్నారు. వ్యాధి తలకు వ్యాపించడంతో కంటిచూపు మందగించి బాధితుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడన్నారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగులేక ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తేవడంతో అతడిని ఆదుకునేందుకు తమ వంతు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు.