economic help
-
‘పసివాడికి చేయూత ’
అమీర్‌పేట: వింత వ్యాధితో బాధపడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన చిన్నారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చారు. వైద్యానికి డబ్బులు లేక బాధిత కుటుంబసభ్యులు పడుతున్న అవస్థలపై ‘సాక్షి’ దినపత్రికలో ‘పాపం పసివాడు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థల యాజమాన్యం అతడికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా తాళ్లగడ్డకు చెందిన షఫీ, మున్సీసాల దంపతుల జానీ(6) రక్త సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీనిపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థల అధినేత మట్టుపల్లి మోహన్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా రూ.3.60లక్షల చెక్కును బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ జోనల్ అడ్మిన్ ప్రిన్సిపాల్స్ ఎస్.ఎమ్.వలి,ఎస్.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా బాలుడి మొఖంపై పగుళ్లు, కురుపులు వచ్చి చీము, రక్తం కారుతుందన్నారు. వ్యాధి తలకు వ్యాపించడంతో కంటిచూపు మందగించి బాధితుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడన్నారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగులేక ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తేవడంతో అతడిని ఆదుకునేందుకు తమ వంతు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. -
చిన్నారిని ఆదుకోరూ..
శామీర్‌పేట్: గొంతు, ఆహారవాహిక శస్ర్త చికిత్సకు ఆర్థిక సహాయం అందించి తమ కుమారుడు భగత్‌ను ఆదుకోవాలని శామీర్‌పేట్‌కు చెందిన ఓ పేద కుటుంబీకులు వేడుకున్నారు. బాధితుడి తల్లిదండ్రులు నవనీత, రమేష్‌లు ‘సాక్షి’కి వివరాలను వెల్లడించారు. శామీర్‌పేట్ మండల కేంద్రానికి చెందిన కనకాల నవనీత, రమేష్ దంపతులు నిరుపేదలు. రోజువారి కూలీతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి కుమారుడు కనకాల భగత్(5)గత సంవత్సరం డిసెంబర్ 25న రసాయన మందు ప్యాకెట్ కొరికాడు. దీంతో భగత్ గొంతు పూర్తిగా చెడిపోయింది. ఆపరేషన్ కోసం నగరంలోని వివిధ ఆస్పత్రులకు తిప్పిన తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేక పోవడంతో ఇంటి వద్దనే భగత్‌కు వైద్యుల సలహామేరకు పాల పాకెట్లతో సాకుతున్నారు. త్వరగా భగత్‌కు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేయాలంటే రూ. సుమారు 6లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేసినట్లు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన భగత్ తల్లిదండ్రులు తమ బిడ్డకు ఆపరేషన్ చేయించాలంటే ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
'నివేదిక ఇస్తే ఆలోచిస్తాం'
కరువు మండలాలకు సాయంపై కేంద్రమంత్రి రాధామోహన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరువు మండలాలను గుర్తించి కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేస్తే ఆర్థిక సహాయంపై ఆలోచిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు నేతృత్వంలో ఇరు రాష్ట్రాల బీజేపీ కిసాన్ మోర్చా ప్రతినిధులు బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిసి ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, కరువు నిధులు విడుదల చేయడం, నకిలీ విత్తనాల అమ్ముతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు భూములు అప్పగిస్తే విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేసినట్లు భేటీ అనంతరం దత్తాత్రేయ విలేకరులకు చెప్పారు. కరువు మండలాలను గుర్తించి నివేదిక పంపాలని, రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక నిధులను ఖర్చుచేసిన వివరాలు అందజేస్తే అదనపు నిధులు ఇస్తామని రాధామోహన్ చెప్పారన్నారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ అధికధరకు విత్తనాలు విక్రయిస్తున్న విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. పేటెంట్ చట్టాల ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో వాణిజ్య శాఖ, ధరల పెంపుపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని రాధామోహన్ సింగ్ చెప్పారన్నారు.