కరువు మండలాలకు సాయంపై కేంద్రమంత్రి రాధామోహన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరువు మండలాలను గుర్తించి కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేస్తే ఆర్థిక సహాయంపై ఆలోచిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు నేతృత్వంలో ఇరు రాష్ట్రాల బీజేపీ కిసాన్ మోర్చా ప్రతినిధులు బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిసి ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, కరువు నిధులు విడుదల చేయడం, నకిలీ విత్తనాల అమ్ముతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు భూములు అప్పగిస్తే విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేసినట్లు భేటీ అనంతరం దత్తాత్రేయ విలేకరులకు చెప్పారు. కరువు మండలాలను గుర్తించి నివేదిక పంపాలని, రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక నిధులను ఖర్చుచేసిన వివరాలు అందజేస్తే అదనపు నిధులు ఇస్తామని రాధామోహన్ చెప్పారన్నారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ అధికధరకు విత్తనాలు విక్రయిస్తున్న విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. పేటెంట్ చట్టాల ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో వాణిజ్య శాఖ, ధరల పెంపుపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని రాధామోహన్ సింగ్ చెప్పారన్నారు.
'నివేదిక ఇస్తే ఆలోచిస్తాం'
Published Thu, Sep 10 2015 1:24 AM | Last Updated on Mon, Aug 20 2018 8:47 PM
Advertisement