'టీడీపీ, బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది'
వరంగల్ : టీడీపీ, బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు ఎద్దేవా చేశారు. మంగళవారం వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో మంత్రి హరీష్రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డబ్బులిచ్చి ఓటర్లను కొనాలని ఆ రెండు పార్టీలు చూస్తున్నారని ఆరోపించారు.
వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో వరంగల్లో హరీష్రావు పర్యటిస్తూ... ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు, టీడీపీ- బీజేపీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
అక్టోబర్ 28వ తేదీన వరంగల్ ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలు తేదీ నవంబర్ 4తో ముగిసింది. నవంబర్ 21న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 24న ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.