కొండపాక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణ(ఫైల్)
- పశువులకు ఆహారంగా మారుతున్న వైనం
- పట్టించుకోని అధికారుల
- ఆగ్రహం వ్యక్తంచేస్తున్న పర్యావరణ ప్రేమికులు
కొండపాక: వర్షాలు సమృద్దిగా కురవాలంటే పర్యావరణ పరిరక్షణ ఒక్కటే పరిష్కారమని గుర్తించిన ప్రభుత్వం హరితహారం చేపట్టింది. దీని కోసం కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. అయితే నాటిన మొక్కలను పర్యవేక్షణ చేయకపోవడంతో ఎండిపోతున్నాయి. అంతేకాకుండా మేకలు, గొర్రెలకు ఆహారంగా మారాయి. అధికారులు గట్టిచర్యలు తీసుకుని హరితహారం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని కోరుతున్నారు.
హరితహారం కోసం మండలంలో ఈజీఎస్, అటవీశాఖ ఆధ్వర్యంలో ఆరు నర్సరీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటి నుంచి మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు మొక్కలు సరఫరాచేస్తున్నారు. ఈజీఎస్ కింద ఖమ్మంపల్లిలో లక్ష మొక్కలు పెంపకం చేపట్టగా, కొండపాక, లకుడారం, వెలికట్ట, మేదినీపూర్, కుకునూరుపల్లి, మర్పడ్గ కేంద్రాల్లోని ఒక్కొక్క నర్సరీలో 75 వేల మొక్కలపెంపకం చేపట్టారు.
మండల వ్యాప్తంగా 4.70 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు కూడా తయారుచేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు, దేవాలయ ప్రాంగణాలు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖ రోడ్లకు ఇరువైపులా, పొలాల గట్లపై సుమారు నాలుగు లక్షల మొక్కలు నాటినట్లు ఇంచార్జి ఎంపీడీఓ ఆనంద్‌మేరీ వివరించారు.
ఈ మొక్కలను ఈజీఎస్ పథకంలో నాటడం జరిగిందని పేర్కొన్నారు. కానీ నాటిన మొక్కలను సంరక్షించే చర్యలను మాత్రం అధికారులు, పాలకులు గాని చర్యలుతీసుకోకపోవడంతో మేకలకు ఆహారంగా మారాయి. దుద్దెడ నుంచి మర్పడ్గ, సిర్సనగండ్ల నుంచి ఓదన్‌చెర్వుల మార్గంలో నాటి మొక్కలు సంరక్షించకపోవడంతో ఎండు పుల్లలుగా మారిపోయాయి.
వాటిని చూసిన ప్రయాణికులు, పాదచారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినా అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి సంరక్షణపై శీతకన్నువేయడం సరికాదని తప్పుబడుతున్నారు. వెంటనే తగుచర్యలు తీసుకుని మిగిలిన మొక్కలను కాపాడాలని కోరుతున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీరందించాలి
మొక్కలు నాటారు మంచిదే కానీ పెరిగే వరకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి. గతంలో వృక్షాలు అధికంగా ఉండటంతో వర్షాలు సకాలంలో కురిసేవి. ప్రస్తుతం చెట్లు లేక వర్షాలు పడటంలేదు. అందుకే వరుస కరువు పరిస్థితి. - లక్ష్మి, కొండపాక
కంచే ఏర్పాటు చేయాలి
ఈజీఎస్ పథకంలో చాలా మొక్కలు నాటారు. వాటి రక్షణకు చుట్టూ కంచె పెట్టించాలి. లేకపోతే మేకలు, పశువులు మేయడం ఖాయం. చర్యలు తీసుకోకుండా ఎంతో ఖర్చు పెట్టి మొక్కలు పెట్టిస్తే ఏం లాభం. వెంటనే కంచె ఏర్పాటు చేసేలా చూడాలి. - బాలవ్వ, వెలికట్ట
ట్యాంకర్ల ద్వార నీరందిస్తాం...
సకాలంలో వర్షాలు కురువాలన్న మంచి ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం పథకాన్ని చేపట్టింది. నాటిన మొక్కలు ఎండిపోకుండా చేసేందుకు ఈజీఎస్ సిబ్బందితో సర్వేబుల్ రిపోర్టులను అప్‌లోడ్ చేయిస్తుంది. పూర్తి కాగానే ట్యాంకర్ల ద్వారా నీరందించడంతో పాటు రక్షణ కోసం కంచెల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. - ఆనంద్‌మేరీ, ఇంచార్జి ఎంపీడీఓ