140 గ్రామాల్లో వందశాతం హరితహారం
- కలెక్టర్ నీతూ ప్రసాద్
ముకరంపుర: జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలకు గాను 140 గ్రామ పంచాయతీలలో వంద శాతం మొక్కలు నాటినట్లు కలెక్టర్ నీతూప్రసాద్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలంగాణకు హరితహారం ప్రగతిపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో వంద శాతం మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 2.86 కోట్ల మొక్కలను నాటామని, వాటి సంరక్షణకు ఫెన్సింగ్, వాటరింగ్ వంటివి సమకూర్చి మొక్కల పెంపుదలకు పటిష్ట ప్రణాళికలు చేపడుతామన్నారు. 2 లక్షల మొక్కలు గ్యాప్ ఫిల్లింగ్ నాటినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు 17 లక్షల మొక్కలు ఆకస్మికంగా తనిఖీ చేసారని వివరించారు. నాటిన మొక్కల వివరాలను అటవీశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నామన్నారు. 1.45 కోట్ల పండ్లు, యూకలిప్టస్ తదితర మొక్కల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వగా ఇప్పటివరకు 17 లక్షల మొక్కలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 5.20 కోట్ల మొక్కలను నర్సరీల్లో పెంచుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ జోయెల్ డేవిస్, ఏజేసీ నాగేంద్ర, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్ తదితరులున్నారు.
హరితహారం, వంద శాతం, కలెక్టర్ నీతూ ప్రసాద్, harithaharm, 100% in 140 villages, collector neetu prasad