
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితురాలు
బంజారాహిల్స్: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడు మూడు నెలలు గడవకముందే కట్నం కోసం భార్యను వేధించి పుట్టింటికి పంపేశాడు. దీంతో న్యాయం చేయాలని బాధిత యువతి సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరు గ్రామానికి చెందిన గాడుదుల లింగమ్మ, శివయ్య దంపతులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో గుడిసె వేసుకొని ఉంటున్నారు. వీరి కుమార్తె కృష్ణవేణి ఫిలింనగర్ మాగంటి కాలనీకి చెందిన కొడలూరి శ్రీకాంత్ ప్రేమించుకున్నారు.
ఏప్రిల్ 29న పెద్ద అంగీకారంతో ఓ మహిళా మండలి నేతృత్వంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన రెండు రోజులకే శ్రీకాంత్ తన అసలు రూపం బయటపెట్టాడు. కట్నం తెస్తే గానీ కాపురం చేయనని భార్యకు చుక్కలు చూపించాడు. శ్రీకాంత్‌కు అతని తల్లి కూడా తోడైంది. అంతా కలిసి కృష్ణవేణిని చిత్రహింసలకు గురి చేశారు. వారు బయటకు వెళ్లేటప్పుడు ఆమెను ఇంట్లో బంధించి, సాయంత్రం వచ్చి తాళాలు తీసేవారు. రెండెకరాల పొలం, రెండు లక్షల నగదు, బంగారం తీసుకొస్తేనే కాపురానికి రా అంటూ ఇటీవల కృష్ణవేణిని భర్త పుట్టింటికి పంపేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.