హర్తాళ్ సక్సెస్!
మూతపడిన దుకాణాలు, విద్యాసంస్థలు
– ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేసిన పోలీసులు
– ఉదయం నుంచే బస్ డిపోల ఎదుట నేతల బైఠాయింపు
– బ్యాంకులకు మినహాయింపు
– అయినా తెరుచుకోని ఏటీఎంలు
– బ్యాంకుల్లోనూ దర్శనమిచ్చిన నో క్యాష్ బోర్డులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులను పరిష్కరించాలంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్తాళ్ కార్యక్రమం విజయవంతమయింది. సోమవారం తెల్లవారుజాము నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలు బస్టాండులోకి వెళ్లి హర్తాళ్ నిర్వహించారు. బస్‌డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా నిరసన చేపట్టారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. అయితే, పోలీసులు మాత్రం ఉదయాన్నే ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. మరోవైపు నోట్ల రద్దుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు బంద్ నిర్వహించాయి. ఎక్కడికక్కడ వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసన నుంచి బ్యాంకులకు మినహాయింపునిచ్చారు. అయినప్పటికీ నోట్ల రద్దు కష్టాలు యథావిధిగా కొనసాగాయి. నగదు రాకపోవడంతో ఏటీఎంలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో కూడా నోక్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. బనగానపల్లె నియోజకవర్గంలో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా హర్తాళ్ నుంచి మినహాయింపునిచ్చారు.
కర్నూలులో ఉదయం 6 గంటలకే వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వామపక్ష నేతలు, కార్యకర్తలు బస్టాండు వద్దకు చేరుకుని బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత బస్టాండు వద్ద నిరసనలో పాల్గొన్నారు. నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని గౌరు డిమాండ్ చేశారు. అంతకు ముందు ఉదయం 9 గంటలకు పోలీసులు రంగప్రవేశం చేసి వైఎస్సార్‌సీపీ నేతలను హఫీజ్‌ఖాన్, సురేందర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. వామపక్ష కార్యకర్తలు జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించగా.. పోలీసులు అరెస్టు చేశారు.