కూలేదాక చూస్తూ ఉంటారా ?
కూలేదాక చూస్తూ ఉంటారా ?
Published Tue, Sep 27 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
* శిథిలావస్థకు చేరిన విద్యుత్ కేంద్ర భవనం
* లక్షల విలువ చేసే సామగ్రికి భద్రత గాలికి
* వర్షం వస్తే ప్లాస్టిక్ పట్టాలే గతి
* భయంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): గుంటూరు జిల్లాకు రైల్వేకు తలమానికమైన తాడేపల్లి పట్టణ పరిధిలోని సిమెంటు ఫ్యాక్టరీ ఏరియాలో ఉన్న 132/133 కేవీ విద్యుత్ ఉపకేంద్రం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగినప్పుడు సిమెంటు ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరాకుగాను ఈ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎర్రగడ్డకు, కడప, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు విద్యుత్‌ను సరఫరా చేసేవారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ విద్యుత్ ఉప కేంద్రంలో విద్యుత్ శాఖలో ఉన్నత పదవులను అలంకరించిన వారెందరో ఇక్కడ పనిచేసిన వారే. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉపకేంద్రం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. ఏ క్షణాన ఈ భవనం కుప్పకూలిపోతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
లక్షల విలువ చేసే సామగ్రికి భద్రత ఏదీ ?
సిమెంటు ఫ్యాక్టరీ విద్యుత్ ఉపకేంద్రంలో 132 కేవీ ఫీడర్లు ఆరు, 33 కేవీ ఫీడర్లు ఏడు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 3 ఉన్నాయి. విజయవాడ గుణదల దగ్గర నుంచి ఇక్కడకు వచ్చే విద్యుత్‌ను స్టెప్ డౌన్ చేసి, కంట్రోల్ ప్యానల్స్ ద్వారా గుంటూరు–1, గుంటూరు–2, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, తుళ్లూరు, అమరావతిలో సగ భాగం, తెనాలి తదితర ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాలకు సరఫరా చేస్తారు. కృష్ణాకెనాల్ రైల్వే జంక్షన్‌కు ఇక్కడి నుంచే పవర్ అందుతుంది. ఏలూరు, చినఅవుట్‌పల్లి దగ్గర నుంచి తెనాలి, గుంటూరు వరకు రైల్వే లైనుకు విద్యుత్‌ను సరఫరా చేస్తారు. అయితే శిథిలావస్థకు చేరిన ఈ విద్యుత్ ఉపకేంద్రంలో విధులు నిర్వర్తించాలంటే సిబ్బంది భయపడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. లక్షలాది రూపాయల విలువ చేసే కంట్రోల్ ప్యానల్స్ ఎక్కడ తడిచి పాడై పోతాయేమోనని సిబ్బంది పట్టాలు, పరదాలు కప్పి ఉంచుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏఈ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి కాగా, మిగిలిన 14 మంది కాంట్రాక్టు సిబ్బంది కావడం గమనార్హం.
Advertisement