భర్తపై ఫిర్యాదు
సైదాపూర్
మోసం చేసి తనను పెళ్లి చేసుకున్న భర్త పుట్టిన బిడ్డను అమ్ముకున్నాడని ఓ బాలింత ఆదివారం సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు,బాధితురాలి కథనం ప్రకారం.. సైదాపూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి జివ్వాజి జయరాజ్‌కు మొదట కొత్తగూడెంకు చెందిన రబేకరాణితో వివాహం జరిగింది. ఏడాది తిరగక ముందే ఆమెతో విడాకులు తీసుకున్నాడు. తర్వాత జమ్మికుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన హేమను 2012, ఏప్రిల్ 28న పెళ్లి చేసుకున్నాడు.
అప్పటికే హేమకు కాగజ్‌నగర్‌కు చెందిన శేషుకుమార్‌తో వివాహం జరిగింది. వారికి కుమారుడు జన్మించాడు. తర్వాత శేషుకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉన్న హేమను నమ్మించి జయరాజ్ పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కొడుకులు జన్మించారు. రెండో కొడుకు జూన్ 10న హన్మకొండలోని మిషన్ ఆస్పత్రిలో పుట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న హేమకు కొడుకును చూపించక ముందే ఆరోగ్యం బాగాలేదని వేరే ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు చెప్పాడు.
అనంతరం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు నమ్మించాడు. రోజులు గడిచినా పసికందును తీసుకురాకపోవడంతో జయరాజ్‌ను నిలదీసింది. ఆగ్రహించిన భర్త బాలింత అని చూడకుండా తీవ్రంగా కొట్టి పుట్టింటికి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నయం కాని వ్యాధితో బాధపడుతున్న జయరాజ్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, 20 రోజుల క్రితం పుట్టిన పసికందును రూ.2 లక్షలకు అమ్ముకున్నాడని ఫిర్యాదు చేసింది.
దీంతో జయరాజ్‌ను పిలిపించిన పోలీసులు పసికందు గురించి ఆరా తీశారు. తాను పిల్లవాడిని ఆస్పత్రిలో చూపించాలని వరుసకు మరదలు అయిన అరుణశ్రీకి అప్పగించానని జయరాజ్ తెలిపాడు. తర్వాత అరుణశ్రీకి ఫోన్ చేస్తే బాబు చనిపోయాడని చెప్పిందని పేర్కొన్నాడు. తాను కొడుకును అమ్ముకోలేదని తెలిపాడు. ప్రస్తుతం శిశువు ఉన్నాడా..? చనిపోయాడా..? ఎవరైనా అమ్ముకున్నారా..?అనేది తేలాల్సి ఉంది.