సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సొంత జిల్లాలోనే... ఆ విభాగం చేతులు ముడుచుకుంది. నిరుపేద లబ్ధిదారులకు అందాల్సిన సొమ్ము పక్కదారి పడుతుంటే మీనమేషాలు లెక్కిస్తోంది. గతంలో వెలుగులోకి వచ్చిన అవినీతి తతంగాలన్నీ ఇక్కడ తూతూమంత్రంగా తుడుచు పెట్టుకుపోవడం కార్పొరేషన్ పనితీరును ప్రశ్నార్థకంగా మార్చాయి. కొన్నింట విచారణలు చేపట్టి... బాధ్యులను గుర్తించినప్పటికీ... నిధులు రికవరీ చేయకుండా కాలం నెట్టుకొస్తున్న తీరు అనుమానాలకు తెరలేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన అవినీతి వ్యవహారాలను సైతం పట్టించుకోకపోవడం పాత ఆనవాయితీని గుర్తుకుతెస్తోంది.
ఇటీవల బోర్ బావులు, సబ్ మెర్సిబుల్ పంప్ సెట్ల పేరుతో జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన సబ్సిడీ సొమ్ము భారీ మొత్తంలో దుర్వినియోగమైన వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. మెట్‌పల్లికి చెందిన ఓ పంప్‌సెట్ల డీలర్ బ్యాంకర్లను, అధికారులను మేనేజ్ చేసి ఒక్క కథలాపూర్ మండలంలోనే ఎక్కువ యూనిట్లు మంజూరు చేయించి.. సబ్సిడీ సొమ్మును మింగేసిన తీరు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కార్పొరేషన్ ఎండీ జయరాజ్ కరీంనగర్, కాకినాడ జిల్లాల్లో సబ్సిడీ సొమ్ముపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీసినట్లు తెలిసింది.
పంప్‌సెట్ల వ్యవహారంపై ప్రాథమిక నివేదిక ఎందుకు పంపించలేదని.. గతంలో విచారణకు వచ్చిన అధికారికి సైతం సంబంధిత ఫైలు ఎందుకు అప్పగించలేదని జిల్లా కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు అధికారులు అలసత్వం ప్రదర్శించిన కొద్దీ సబ్సిడీ సొమ్ముతో దాగుడు మూతలాడిన బ్యాం కర్లు, అక్కడి అధికారులు, స్థానిక నేతలు అప్రమత్తమయ్యారు. తమ తప్పేమీ లేదని తప్పిం చుకునేందుకు బోగస్ లబ్ధిదారులను మూటగట్టుకొని తిమ్మిని బమ్మిచేసే ప్రయత్నాలు ప్రారం భించారు. గతంలో జిల్లాలో జోగినీ స్త్రీలకు పునరావాసం, ఆర్థిక సాయం పంపిణీలో అవినీతి జరిగింది. మహిళా సమృద్ధి యోజన పేరిట మహిళా గ్రూపులకు ఇచ్చే ఆర్థిక సాయం కూడా పక్కదారి పట్టింది. స్వయంగా అప్పుడు పనిచేసిన కార్పొరేషన్ అధికారులు, కొందరు ఉద్యోగులకు అందులో ప్రమేయముందని.. కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ నిధులను సొంత ఖాతాలకు మళ్లించారని అభియోగాలు నమోదయ్యాయి.
తదుపరి జరిగిన విజిలెన్స్ విచారణలోనూ ఈ నిజాలు బయటపడ్డాయి. బాధ్యులైన వారిలో ఎక్కువ మంది జిల్లా నుంచి బదిలీపై వెళ్లగా... కొందరు ఇప్పటికీ ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్న కార్పొరేషన్ కనీసం దుర్వినియోగమెన లక్షలాది రూపాయలను వారి నుంచి రికవరీ చేయటం మరిచిపోయింది. ఇదే తీరు కొనసాగితే... సర్కారు సబ్సిడీలన్నీ యథేచ్ఛగా పక్కదారి పట్టే ప్రమాదముంది. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి ఎదిగిన లక్ష్మణ్‌కుమార్ ఈ వ్యవహారాలపై ఇప్పటికైనా దృష్టి సారిస్తారా? లేదా వేచి చూడాల్సిందే!
మీ ఇలాఖాలో.. ఇలా..
Published Thu, Dec 5 2013 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement