ప్రై మరీ యాంజియోప్లాస్టీతో గుండెపదిలం
కర్నూలు(హాస్పిటల్): గుండెపోటుకు గురైన రోగికి 24గంటల్లోపు ప్రై మరీ యాంజియోప్లాస్టీ చేయడం వల్ల మరణించే అవకాశం బాగా తగ్గుతుందని ఏపీ కార్డియాలజిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి. చంద్రశేఖర్ చెప్పారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఐసీసీయూ వసతులు ఉన్న ఆసుపత్రికి తరలించి, అవసరమైన మందులు ఇచ్చి వెంటనే యాంజియోప్లాస్టీ ద్వారా గుండెరక్తనాళాల్లో మూసుకుపోయిన బ్లాక్‌లు తెరిస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ నెల 31వ తేది వరకు ప్రై మరీ యాంజియోప్లాస్టీ చికిత్సలు నిర్వహించి, జాతీయ స్థాయిలో రిజిస్ట్రేషన్‌కు పంపిస్తామని తెలిపారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 20 నుంచి 22 మంది గుండెపోటుకు గురై వస్తున్నారని చెప్పారు. సంఘం కోశాధికారి డాక్టర్ వసంతకుమార్ మాట్లాడుతూ.. తమ సంఘంలోని రూ.1.50కోట్లకు బ్యాంకు ద్వారా వచ్చే వడ్డీ నుంచి ఈ కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. దేశంలో గుండెజబ్బులు పెరుగుతున్నా అంతే స్థాయిలో వైద్యసౌకర్యాలు పెరగడం లేదన్నారు. సమావేశంలో కార్డియాలజిస్టు డాక్టర్ మహమ్మద్ అలీ పాల్గొన్నారు.