కొత్తగూడెం: పారిశ్రామిక ప్రాంతం కొత్తగూడెంపై భానుడు ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. వరుసగా మూడోరోజు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడికి తోడు మంగళవారం వడగాలులు విపరీతంగా వీయడంతో ప్రజలు అల్లాడిపోయారు. సింగరేణి కార్మిక ప్రాంతం ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎండ వేడితో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు వృద్ధులు, కూలీలు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు.
మరికొంతమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎండదెబ్బ తగలడంతో ఈ మూడురోజులుగా ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. కార్మిక ప్రాంతాలు, స్థానిక ఓపెన్‌కాస్టు గనికి అతి సమీపంలో ఉన్న ప్రజలు, కార్మిక కుటుంబాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిత్యం వీస్తున్న వేడి గాలులు, భానుడి ప్రభావంతో ఇళ్లల్లో సైతం ఉండలేక పోతున్నారు.
కార్మికుల ఇళ్లకు ఏసీలు పెట్టుకునేందుకు యాజమాన్యం అనుమతించకపోవడం, కూలర్ల గాలి ఏమాత్రం సరిపోకపోవడంతో ఉక్కపోత మధ్య కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఓపెన్‌కాస్టు గనిలో మధ్యాహ్నం షిఫ్టుకు వెళ్లే కార్మికుల సంఖ్య విపరీతంగా తగ్గుముఖం పట్టింది. సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉండటం, బొగ్గు పెళ్లల మధ్య ఉండటంతో వేడి మరింత ఎక్కువగా ఉండటం వల్ల విధులకు హాజరయ్యే కార్మికులు జంకుతున్నారు. ఎండదెబ్బ కారణంగా జాతీయ రహదారి మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. మధ్యాహ్నం రోడ్లు, షాపులు ఖాళీగా దర్శనమిచ్చాయి. రోడ్లవెంట ఉండే చిరు వ్యాపారులు ఎండల కారణంగా వ్యాపారాలను మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రోడ్లవెంట నీళ్లు చల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మూడో రోజూ భగభగ
Published Tue, May 24 2016 10:29 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement
Advertisement