దుర్గమ్మ దర్శనానికి భక్తుల పోటు
దుర్గమ్మ దర్శనానికి భక్తుల పోటు
Published Sun, Aug 14 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
పుష్కర యాత్రికులతో ఆదివారం దుర్గమ్మ సన్నిధి కిటకిటలాడింది. పుష్కరాల మూడో రోజు, ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో రికార్డు స్థాయిలో యాత్రికులు అమ్మవారి దర్శనానికై తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి మొదలైన యాత్రికుల రద్దీ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్షన్నర మంది భక్తులు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం ఆగస్టు 15 సెలవు కావడంతో ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మహా మండపం, మల్లికార్జునస్వామి వారి ఆలయం వైపు నుంచి కొండ కిందకు చేరుకుంటున్నారు. మహా మండపంలోని ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీ, రూ.300 శీఘ్రదర్శనం టికెట్లతో పాటు నాలుగు ఉచిత సర్వ దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అన్ని క్యూలైన్ మార్గాలలో నిరంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా దేవస్థాన సిబ్బంది చర్యలు తీసుకున్నారు.
అశోకస్థూపం వరకు క్యూలైన్లలో రద్దీ
అమ్మవారి దర్శనానికి రికార్డు స్థాయిలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లలో రద్దీ నెలకుంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు రద్దీ మరింత పెరిగింది. దీంతో అశోకస్ధూపం వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు బారలు తీరి కనిపించారు. దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది.
రికార్డు స్థాయి ఆదాయం
అమ్మవారికి ఆదివారం ఒక్క రోజే రూ. 20.87 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులతో పాటు పుష్కర యాత్రికులకు 20 వేల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది.
Advertisement
Advertisement