గుడుంబాపై ఉక్కుపాదం
మద్యం దుకాణాలను తనిఖీ చేసిన మంత్రి పద్మారావు
ఏటూరునాగారం: తెలంగాణను గుడుంబా లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని.. ఇందులో భాగంగా గుడుంబాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిం దని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని భాగ్యలక్ష్మి, సాయి తిరుమల వైన్స్‌లను ఆయన సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అధికారులకు ఎలాం టి సమాచారం ఇవ్వకుండా.. తన సొంత వాహనంలో ఇక్కడికి వచ్చినట్లు ఈ సందర్భం గా మంత్రి తెలిపారు.
ముందుగా ఆయన భాగ్యలక్ష్మి వైన్స్‌లో తన సిబ్బందితో ఫుల్‌బాటిల్ మద్యం కొనుగోలు చేయించారు. ఎమ్మా ర్పీ కంటే రూ.5 ఎక్కువ తీసుకోవడంతో మంత్రి అక్కడి వెళ్లి పరిశీలించారు. మద్యం, బాటిళ్లు కాటన్లను తెరిచి పరిశీలించారు. భాగ్యలక్ష్మి బ్రాందీషాపు యజమానికి పాన్‌కార్డు లేకపోవడంతో అదనంగా 20 శాతం పన్ను పడుతుందని.. పాన్‌కార్డు లేకపోవడంతో శాఖ పరంగా స్టాకు ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం లెసైన్స్‌లు ఇచ్చి 12 రోజులు అవుతున్నా.. ఇంకా ఆబ్కారీ నుంచి మద్యం కొనుగోలు చేయకుండా మండల కేంద్రంలోనే ఉన్నా.. సాయి తిరుమల మద్యం షాపు నుంచి మద్యం దిగుమతి చేసుకున్నట్లు తేలిందన్నారు.
అక్కడ ఉన్న మద్యం కాటన్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న భాగ్యలక్ష్మి బ్రాందీ షాపును మూసివేయించా రు. దీనికి మద్యం సరఫరా చేసిన సాయి తిరుమల దుకాణంపై కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. అలాగే, స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో 12 మంది సిబ్బంది ఉండగా, ఒక్క హెడ్‌కానిస్టేబుల్ మాత్రమే ఉండడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు డుమ్మా కొట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.