వానో వాన
=జిల్లాపై కొనసాగుతున్న వరుణుడి కరుణ
=మూడు రోజుల్లోనే 60 మి.మీ సగటు వర్షపాతం నమోదు
=పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. నిండిన కుంటలు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా వరుణుడి కరుణ కొనసాగుతోంది. 25 రోజుల బెట్ట పరిస్థితుల తర్వాత వానలు పడుతుండటంతో ఖరీఫ్ పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూలై సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా, ఇప్పటికే 86.3 మి.మీ నమోదైంది. ఇందులో గత మూడు రోజుల్లోనే ఏకంగా 60 మి.మీ నమోదు కావడం విశేషం. ఈ నెల 26న 21.2 మి.మీ, 27న 13.9 మి.మీ, 28న 24.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
మడకశిర, ముదిగుబ్బ, కంబదూరు, కణేకల్లు, విడపనకల్లు, వజ్రకరూరు, ఆత్మకూరు, పుట్లూరు, యల్లనూరు, తాడిమర్రి, ఓడీ చెరువు, నల్లమాడ, గోరంట్ల, కొత్తచెరువు, కనగానపల్లి, పెనుకొండ, కళ్యాణదుర్గం, సోమందేపల్లి, రొద్దం, చిలమత్తూరు, లేపాక్షి, పరిగి తదితర మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గుడిబండ, అగళి, అమరాపురం, డి.హీరేహాల్, బొమ్మనహాళ్, నల్లచెరువు, గాండ్లపెంట మండలాల్లో మాత్రం కాస్త తక్కువగా వర్షం పడింది.
భారీ వర్షాలు కురిసిన మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుంటలు, చెక్‌డ్యాంలు నిండాయి. దీని వల్ల భూగర్భజలాల పరిస్థితి మెరుగయ్యే అవకాశముంది. ఖరీఫ్ పంటలకు 20 రోజుల పాటు ఢోకా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాలకు పంటలకు ఆశించిన చీడపీడలు, పురుగులు కూడా అదుపులోకి వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికీS భూములు బీడుగా ఉన్న వాటిలో ఏదో ఒక పంట పెట్టుకోవాలని సూచించారు.
కంబదూరులో భారీ వర్షం
గురువారం జిల్లాలోని 63 మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కంబదూరు మండలంలో 79.3 మి.మీ వర్షం కురిసింది. కళ్యాణదుర్గం 67 మి.మీ, కనేకల్లు 63.6, వజ్రకరూరు 56.6, మడకశిర 54, శింగనమల 50.4, అనంతపురం 41.5, యాడికి 39.6, లేపాక్షి 38.6, శెట్టూరు 38.1, కుందుర్పి 37.2, తాడిమర్రి 36, బెళుగుప్ప 35.2, గుంతకల్లు 34.5 మి.మీ వర్షం కురిసింది.