kambadur
-
‘రూర్బన్’కు గ్రహణం
శ్యాంప్రసాద్ ముఖర్జీ పథకానికి ఎంపికైన కంబదూరు ఆరునెలల క్రితమే రూ.8.82 కోట్లు నిధులు విడుదల చినబాబు రాక... ప్రారంభం కాని పనులు గ్రామీణ ప్రాంతాల్లోని వారికి పట్టణాల్లోలాగా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్పీఎంఆర్ఎం)పథకానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఈ పథకం కింద ఎంపికైన కంబదూరు మండలానికి ఆరు నెలల క్రితమే రూ.8.82 కోట్లు మంజూరైనా కేవలం మంత్రి లోకేష్ పర్యటన ఖరారు కాలేదన్న సాకుతో ఏ ఒక్క పనీ ఇంతవరకూ ప్రారంభించలేదు. - కంబదూరు: శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్పీఎంఆర్ఎం)పథకానికి కంబదూరు మండలాన్ని 2015లో ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా మండలంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో తమ గ్రామాల రూపురేఖలు మారిపోతాయని మండలవాసులంతా ఆనందపడ్డారు. ఈ ప«థకం కింద ఈ ఏడాది ఏప్రిల్ రూ.8.82 కోట్ల నిధులు మంజూరు కూడా చేశారు. కానీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన ఖరారు కాకపోవడంతో అధికారులు ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. మూడేళ్లలో రూ.వంద కోట్లతో అభివృద్ధి మూడేళ్లలో రూ.వంద కోట్లతో అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మండలంలో 12 పంచాయతీలు 42 గ్రామాలుండగా 51 వేల మంది జనాభా ఉంది. పథకం అమలైతే వీరి జీవన స్థితిగతులు మారే అవకాశం ఉంది. పథకం ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయో...అలాంటివన్నీ శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్పీఎంఆర్ఎం)కింద గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం, విశాఖపట్నంలోని అరకులోయ, ప్రకాశంలోని సింగరాయకొండ, నెల్లూరులోని వెంకటచలం మండలాలతో పాటు మన జిల్లాలోని కంబదూరు మండలాన్ని ఎంపిక చేసింది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మూడేళ్ల పాటు రూ.100 కోట్ల నిధులను మంజూరు చేయనున్నాయి. ప్రతిపాదనలు సిద్ధం రూర్బన్ పథకానికి ఎంపికైన కంబదూరు మండలంలోని వివిధ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించారు. మౌలిక వసతుల కల్పనకు రూ.127 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. అనేకసార్లు స్థానిక మండల పరిషత్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడ పథకంపై సమీక్షించారు. సౌకర్యాల కల్పన ఇలా... శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణం, వీధిదీపాలు, పైపుల్లో తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల యాజమాన్యం, నిరుద్యోగులకు, మహిళలకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాల శిక్షణ కేంద్రాల ఏర్పాటు, అందరికీ వంట గ్యాస్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పక్కాభవనాల నిర్మాణం, విద్య, వైద్య పరంగా మెరుగైన సేవలు అందిస్తారు. ఇందులో 30 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంఽడగా, 70 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మంత్రి పర్యటన ఖరారు కాలేదు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అయితే మంత్రి పర్యటన తేదీలు ఖరారు కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఈనెలలోపే పనులు ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం విడుదలైన నిధులన్నీ ఎంపీడీఓ ఖాతాలోనే ఉన్నాయి. వాటికి ఎస్ట్మెంట్లు తయారు చేస్తున్నాం. – శివారెడ్డి, ఎంపీడీఓ, కంబదూరు -
ఉపాధి పనులు పరిశీలన
కంబదూరు: మండలంలో ఉపాధి హామీ పథకం కింద 2016, 17, 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.16 కోట్లతో చేపట్టిన ఫారంపాండ్లు,హార్టికల్చర్,మట్టి రోడ్లు, అవెన్యూ ప్లాంటేషన్,వ్యక్తిగత మరుగుదొడ్లు,వర్మీకంపోస్టు, చెరువులో పూడికతీత తదితర పనులను మంగళవారం స్టేట్ బృందం సభ్యులు పరిశీలించారు. మండలంలోని ములకనూరు వద్ద చేపట్టిన పనులను స్టేట్ బృందం సభ్యులు రాంప్రసాద్, గోవర్ధన్, సాయికిశోర్, భాగ్యరాజ్, అనూష, మూర్తి, శ్రీనివాసులు కొలతలు తీసి పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీకి సంబంధించిన 20 రికార్డులను తనిఖీ చేశారు. త్వరలో కేంద్ర బృందం కమిటీ సభ్యులు వచ్చే అవకాశం ఉందన్నారు. వీరి వెంట అడిషనల్ పీడీ రాజేంద్ర ప్రసాద్, ఏపీడీ విజయలక్ష్మి, ఎంపీడీఓ శివారెడ్డి, ఏపీఓ హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్సీ నారాయణప్ప మృతి
కంబదూరు (కళ్యాణదుర్గం) : దివంగత మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ భర్త, మాజీ ఎమ్మెల్సీ కె.బి.నారాయణప్ప (81) మృతి చెందారు. ఈయన కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని జాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 2010 నుంచి 2011 వరకు ఏడాదిన్నరపాటు నారాయణప్ప ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈయనకు కుమారులు శ్రీధర్, శివాజీతోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజకీయ నేపథ్యం.. నారాయణప్ప కుటుంబానికి మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉంది. నారాయణప్ప తండ్రి కె.బి.శాంతప్ప కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతితో మామ వారసురాలిగా నారాయణప్ప భార్య లక్ష్మీదేవమ్మ రాజకీయ రంగప్రవేశం చేసి 1972 –78, 1989–94 రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పనిచేశారు. 1982–2007లో ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్‌గా పనిచేశారు. ఆమె 2010లో మృతి చెందడంతో.. ఆమె స్థానంలో నారాయణప్ప ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు నారాయణప్ప స్వగ్రామైన కంబదూరులో శనివారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పార్థివదేహానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు నివాళులర్పించారు. -
కంబదూరు పట్టణీకరణకు సమగ్ర ప్రణాళిక
అనంతపురం అర్బన్ : కంబదూరు మండలం పట్టణీకరణ పనులకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కంబదూరు క్టసర్ ఎన్ఆర్యూఎం (నేషనల్ రుర్బన్ మిషన్)పై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కంబదూరు క్లస్టర్ పట్టణీకరణ క్రమంలో మౌలిక వసతుల కల్పన, చేపట్టాల్సిన పనులకు సంబంధించిన పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు. కంబదూరు క్లస్టర్‌ను పట్టణ తరహాలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్, జిల్లా మిషన్ లీడర్ సూచించారు. ఎన్ఆర్యూఎం కమిటీలో ప్రస్తుతం ఉన్న సభ్యులే కాకుండా సంయుక్త కలెక్టర్, డీఆర్డీఏ పీడీ, ఎల్డీఎం, డీపీఈఓ, ఐసీడీఎస్‌పీడీ, వ్యవసాయ శాఖ జేడీతో పాటు ప్రాథమిక రంగంలోని ప్రతి అధికారినీ చేర్చాలని ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులు సీపీఓ సుదర్శనం, డ్వామా పీడీ నాగభూషణం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరాంనాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరావు, డీపీఓ జగదీశ్వరమ్మ, కంబదూరు ఎంపీడీఓ, క్లస్టర్ కో - ఆర్డినేటర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్‌కు అవమానం
కంబదూరు : మండలంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో తహసీల్దార్ రఫీక్అహ్మద్కు అవమానం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ నవనిర్మాణ దీక్ష టీడీపీ సొంత కార్యక్రమంలా మారింది. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వేదికపైకి తహసీల్దార్ రఫీక్అహ్మద్ను పిలువకుండా ఎమ్మెల్యే ఉన్నం, జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి, ఎంపీపీ దండా గోవింద్చౌదరి, టీడీపీ మండల కన్వీనర్, పార్టీ జిల్లా కార్యదర్శి, ఎస్సీ సెల్ అ«ధ్యక్షుడు, మిగిలిన టీడీపీ నాయకులు ఆశీనులైయ్యారు. దీంతో ఎమ్మెల్యే సాక్షిగా మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్‌ను కార్యక్రమం ముగిసేంత వరకు వేదిక కిందే కూర్చోబెట్టి అవమాన పరిచారు. తహసీల్దార్కే గౌరవం లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని మండలవాసులు విస్తుపోయారు. -
కమనీయం శివపార్వతుల కల్యాణోత్సవం
కంబదూరు : శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన గురువారం మండల కేంద్రంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణమహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక అలంకరణలో ఏర్పాటు చేసిన కల్యాణమండపంలో ఉదయం వేదపండితులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతిచౌదరి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలాంబ్రాలు సమర్పించారు. మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామివారిని పూలరథంలో ఉరేగించారు. మార్కెట్ యార్డు చైర్మన్ రామాంజినేయులు, ఆలయ ఈఓ రామాంజినేయులు, జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి, మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ, సర్పంచ్ శ్రీరాములు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి దండా వెంకటేశులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సురేంద్ర, అర్చకులు మంజునాథ్, దుర్గాప్రసాద్, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నీలిశంకరప్ప పాల్గొన్నారు. -
క్రీడలు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి
కంబదూరు : క్రీడలు మానసికోల్లాసాన్నినివ్వడంతో పాటు శరీరక దృఢత్వాన్ని ఇస్తాయని స్టేట్‌బ్యాంక్ మేనేజర్ విష్ణువర్దన్, మాజీ ఎంపీపీ లక్ష్మినారాయణ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సైనానెహ్వాల్– 5 జోన్ బాలుర గ్రిగ్స్ పోటీల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం జరిగిన వాలీబాల్, హ్యండ్‌బాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, త్రోబాల్, టెన్నికాయిట్ పోటీల్లో కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి 60 పాఠశాలలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పోటీలు నిర్వహించారు. రెండోరోజు విజేత జట్ల వివరాలివీ.. : రెండో రోజు సెనానెహ్వాల్ జోన్–5 గ్రిగ్స్ పోటీల్లో భాగంగా రెండో రోజు జరిగిన మ్యాచ్‌ల వివరాలిలా ఉన్నాయి. సీనియర్ బాస్కెట్ బాల్ విభాగంలో కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప హైస్కూల్–కంబదూరు హైస్కూల్ జట్లు తలపడ్డాయి. ఇందులో కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప హైస్కూల్ జట్టు విజయం సాధించింది. జూనియర్ బాస్కెట్‌బాల్ విభాగంలో కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప హైస్కూల్–రాయదుర్గం హైస్కూల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కరణం చిక్కప్ప హైస్కూల్ జట్టు విజయం సాధించింది. జూనియర్ సాఫ్ట్‌బాల్ విభాగంలో కణేకల్లు హైస్కూల్–ముద్దినాయినిపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కణేకల్లు జట్టు గెలుపొందింది. సీనియర్ హ్యండ్‌బాల్ పోటీల్లో కళ్యాణదుర్గం జట్టుపై కంబదూరు హైస్కూల్ జట్టు విజయం సాధించింది. సీనియర్ త్రోబాల్ పోటీల్లో కంబదూరు, గంగవరం, కణేకల్లు, మాల్యం హైస్కూల్ జట్లు సెమిస్కు చేరాయి. జూనియర్ టెన్నికాయిట్ పోటీల్లో మాల్యం జట్టు ఫైనల్‌కు చేరింది. సీనియర్ చెస్ పోటీల్లో కంబదూరు జట్టు ఫైనల్‌కు చేరింది. సీనియర్ కబడ్డీ పోటీల్లో ఉడేగోళం జట్టు కణేకల్లు జట్టుపై విజయం సాధించి సెమిఫైనల్‌కు చేరినట్లు పీఈటీ మురళి తెలిపారు. -
వానో వాన
=జిల్లాపై కొనసాగుతున్న వరుణుడి కరుణ =మూడు రోజుల్లోనే 60 మి.మీ సగటు వర్షపాతం నమోదు =పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. నిండిన కుంటలు అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా వరుణుడి కరుణ కొనసాగుతోంది. 25 రోజుల బెట్ట పరిస్థితుల తర్వాత వానలు పడుతుండటంతో ఖరీఫ్ పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూలై సాధారణ వర్షపాతం 67.4 మి.మీ కాగా, ఇప్పటికే 86.3 మి.మీ నమోదైంది. ఇందులో గత మూడు రోజుల్లోనే ఏకంగా 60 మి.మీ నమోదు కావడం విశేషం. ఈ నెల 26న 21.2 మి.మీ, 27న 13.9 మి.మీ, 28న 24.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మడకశిర, ముదిగుబ్బ, కంబదూరు, కణేకల్లు, విడపనకల్లు, వజ్రకరూరు, ఆత్మకూరు, పుట్లూరు, యల్లనూరు, తాడిమర్రి, ఓడీ చెరువు, నల్లమాడ, గోరంట్ల, కొత్తచెరువు, కనగానపల్లి, పెనుకొండ, కళ్యాణదుర్గం, సోమందేపల్లి, రొద్దం, చిలమత్తూరు, లేపాక్షి, పరిగి తదితర మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గుడిబండ, అగళి, అమరాపురం, డి.హీరేహాల్, బొమ్మనహాళ్, నల్లచెరువు, గాండ్లపెంట మండలాల్లో మాత్రం కాస్త తక్కువగా వర్షం పడింది. భారీ వర్షాలు కురిసిన మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుంటలు, చెక్‌డ్యాంలు నిండాయి. దీని వల్ల భూగర్భజలాల పరిస్థితి మెరుగయ్యే అవకాశముంది. ఖరీఫ్ పంటలకు 20 రోజుల పాటు ఢోకా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాలకు పంటలకు ఆశించిన చీడపీడలు, పురుగులు కూడా అదుపులోకి వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికీS భూములు బీడుగా ఉన్న వాటిలో ఏదో ఒక పంట పెట్టుకోవాలని సూచించారు. కంబదూరులో భారీ వర్షం గురువారం జిల్లాలోని 63 మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కంబదూరు మండలంలో 79.3 మి.మీ వర్షం కురిసింది. కళ్యాణదుర్గం 67 మి.మీ, కనేకల్లు 63.6, వజ్రకరూరు 56.6, మడకశిర 54, శింగనమల 50.4, అనంతపురం 41.5, యాడికి 39.6, లేపాక్షి 38.6, శెట్టూరు 38.1, కుందుర్పి 37.2, తాడిమర్రి 36, బెళుగుప్ప 35.2, గుంతకల్లు 34.5 మి.మీ వర్షం కురిసింది.