‘రూర్బన్’కు గ్రహణం
శ్యాంప్రసాద్ ముఖర్జీ పథకానికి ఎంపికైన కంబదూరు
ఆరునెలల క్రితమే రూ.8.82 కోట్లు నిధులు విడుదల
చినబాబు రాక... ప్రారంభం కాని పనులు
గ్రామీణ ప్రాంతాల్లోని వారికి పట్టణాల్లోలాగా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్‌పీఎంఆర్‌ఎం)పథకానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఈ పథకం కింద ఎంపికైన కంబదూరు మండలానికి ఆరు నెలల క్రితమే రూ.8.82 కోట్లు మంజూరైనా కేవలం మంత్రి లోకేష్ పర్యటన ఖరారు కాలేదన్న సాకుతో ఏ ఒక్క పనీ ఇంతవరకూ ప్రారంభించలేదు.
- కంబదూరు:
శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్‌పీఎంఆర్‌ఎం)పథకానికి కంబదూరు మండలాన్ని 2015లో ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా మండలంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో తమ గ్రామాల రూపురేఖలు మారిపోతాయని మండలవాసులంతా ఆనందపడ్డారు. ఈ ప«థకం కింద ఈ ఏడాది ఏప్రిల్ రూ.8.82 కోట్ల నిధులు మంజూరు కూడా చేశారు. కానీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన ఖరారు కాకపోవడంతో అధికారులు ఇంతవరకు పనులు ప్రారంభించలేదు.
మూడేళ్లలో రూ.వంద కోట్లతో అభివృద్ధి
మూడేళ్లలో రూ.వంద కోట్లతో అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మండలంలో 12 పంచాయతీలు 42 గ్రామాలుండగా 51 వేల మంది జనాభా ఉంది. పథకం అమలైతే వీరి జీవన స్థితిగతులు మారే అవకాశం ఉంది.
పథకం ముఖ్య ఉద్దేశం
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయో...అలాంటివన్నీ శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్‌పీఎంఆర్‌ఎం)కింద గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం, విశాఖపట్నంలోని అరకులోయ, ప్రకాశంలోని సింగరాయకొండ, నెల్లూరులోని వెంకటచలం మండలాలతో పాటు మన జిల్లాలోని కంబదూరు మండలాన్ని ఎంపిక చేసింది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మూడేళ్ల పాటు రూ.100 కోట్ల నిధులను మంజూరు చేయనున్నాయి.
ప్రతిపాదనలు సిద్ధం
రూర్బన్ పథకానికి ఎంపికైన కంబదూరు మండలంలోని వివిధ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించారు. మౌలిక వసతుల కల్పనకు రూ.127 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. అనేకసార్లు స్థానిక మండల పరిషత్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడ పథకంపై సమీక్షించారు.
సౌకర్యాల కల్పన ఇలా...
శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణం, వీధిదీపాలు, పైపుల్లో తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల యాజమాన్యం, నిరుద్యోగులకు, మహిళలకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాల శిక్షణ కేంద్రాల ఏర్పాటు, అందరికీ వంట గ్యాస్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కాభవనాల నిర్మాణం, విద్య, వైద్య పరంగా మెరుగైన సేవలు అందిస్తారు. ఇందులో 30 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంఽడగా, 70 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
మంత్రి పర్యటన ఖరారు కాలేదు
మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అయితే మంత్రి పర్యటన తేదీలు ఖరారు కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఈనెలలోపే పనులు ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం విడుదలైన నిధులన్నీ ఎంపీడీఓ ఖాతాలోనే ఉన్నాయి. వాటికి ఎస్ట్‌మెంట్లు తయారు చేస్తున్నాం.
– శివారెడ్డి, ఎంపీడీఓ, కంబదూరు