
సాక్షి, హైదరాబాద్: దేశ సమైక్యత కోసం కృషి చేసిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం లేదని నెహ్రూతో విభేదించి ప్రభుత్వంలో నుంచి ముఖర్జీ బయటకు వచ్చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆయనకు పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని, ప్రత్యేక రాజ్యాంగం వద్దని సూచించారన్నారు. ప్రస్తుతం రగులుతున్న రావణ కాష్టానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. 1951లో జనసంఘ్‌ను స్థాపించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారన్నారు. చివరి ఊపిరి వరకు కశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉండాలని పోరాటం చేసినందునే ఆయన వర్ధంతి రోజును బలిదాన్ దివస్‌గా నిర్వహిస్తున్నామన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక గాంధీజీ పిలుపు మేరకు సమైక్య ప్రభుత్వం కోసం కృషి చేశారన్నారు. అందులో భాగంగానే నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరారని, కశ్మీర్ అంశంలో విభేదించి ప్రభుత్వం నుంచి బయటకువచ్చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీమంత్రి విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment