ప్రకృతి ప్రకోపం | heavy rain in distic | Sakshi
Sakshi News home page

ప్రకృతి ప్రకోపం

Published Fri, May 20 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

ప్రకృతి ప్రకోపం

ప్రకృతి ప్రకోపం

జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
విరిగిన చెట్లు, కూలిన స్తంభాలు, ధ్వంసమైన ఇళ్లు

గాలి వాన.. పెను బీభత్సం సృష్టించింది. జిల్లాలో పొద్దంతా పొడిపొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మేఘావృతమై భారీ గాలులతో వర్షం కురిసింది. నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట తదితర ప్రాంతాల్లో భారీనష్టం వాటిల్లింది.  వృక్షాలు.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఒక్క కల్హేర్ మండలంలోనే వందకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. నల్లవాగులో ఏర్పాటు చేసిన పశువుల పునరావాస షెడ్డు నేలమట్టమయ్యింది.

న్యాల్‌కల్: మండలంలో గురువారం సాయంత్రం వీచిన భారీ గాలులకు పలు ఇళ్ల పైకప్పులు ఎరిగిపోయాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. తీగలు తెగిపడడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. న్యాల్‌కల్, ముంగి, టేకూర్ తదితర గ్రామాల్లో భారీ గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్తు సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి స్తంభాలను, తీగలను సరిచేసి గ్రామాల్లో కరెంటు పునరుద్దరించారు.

 కంగ్టి మండలంలో భీతావాహం
కంగ్టి: మండలంలోని వర్షం భీభత్సం సృష్టిం చింది. చీమల్‌పాడ్, వంజు తండా, గర్డేగాం, గాజుల్‌పాడ్ తదితర గ్రామాల్లో ఎల్‌టీ విద్యుత్ తీగలు, స్తంభాలు విరిగిపడ్డాయి. తడ్కల్‌లో రేకులు ఎగిరి 11 కేవీ విద్యుత్ తీగలపై పడ్డాయి.

 పిడుగుపాటుకు ఎద్దు మృతి
కంగ్టి: తడ్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఘన్‌పూర్ చెరువులో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షంతో పాటు పిడుగు పడింది. అదే సమయంలో చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లిన ఎద్దు మృతిచెందిందని యాజమానురాలు దమ్మని నాగమ్మ తెలిపింది. ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుందని, ఆదుకోవాలని విజ్తప్తి చేసింది.

 విరిగిన విద్యుత్తు స్తంభాలు
రేగోడ్: రేగోడ్, సిందోల్, తాటిపల్లి, కొత్వాన్‌పల్లి, ప్యారారం, చౌదర్‌పల్లి, కొండాపురం, జగిర్యాల, ఆర్.ఇటిక్యాల, దుద్యాల, పలు తండాలు, గ్రామాల్లో పలు ఇళ్ల పైరేకులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగి నేలపై పడ్డాయి. 

 మామిడి తోటలకు తీవ్రనష్టం
జహీరాబాద్ టౌన్: ఈదురు గాలులకు జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. ఈ సంవత్సరం తక్కువగా ఉన్న మామిడి కాపు రాలిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రాంనగర్, భరత్‌నగర్, పస్తాపూర్, దిడ్గి, కోత్తూర్. బూచినెల్లి, రంజోల్ గ్రామాల్లోని ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి.

 100 పైగా ఇళ్లు ధ్వంసం
కల్హేర్: కల్హేర్ మండలం సిర్గాపూర్, నల్లవాగు, అంతర్‌గాం, బోక్కస్‌గాం, గోసాయిపల్లి తదితర చోట్ల గురువారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీయడంతో దాదాపు 100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సిర్గాపూర్‌లో సోలార్ విద్యుత్ ప్లాంట్ కు సంబందించిన ప్లేట్లు ఎగిరిపోయాయి. నల్లవాగులో ఏర్పాటు చేసిన పశువుల పునరావస కేంద్రం షెడ్లు కూలిపోయాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement