బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వానలు రంగారె డ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. పలుచోట్ల ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. అల్ప పీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలే న మోదయ్యాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పలు దఫాలుగా వాన కురిసింది. జిల్లాలో సగటున 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వ ర్షాలతో తాండూరులోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీపంలోని మన్సన్‌పల్లి, కందనెల్లి, బుద్దారం, వెల్గటూరు వాగులు పరుగులు తీస్తున్నాయి. వాగులు ప్రవహిస్తున్న రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కీసరలో 18 సెంటీమీటర్ల వాన...
జిల్లాలో అత్యధికంగా కీసరలో 18 సెంటీమీటర్ల వాన నమోదయింది. అదేవిధంగా, చేవెళ్లలో 13.7సెంటీమీటర్లు, బంట్వారంలో 12.6 సెంటీమీటర్లు, ధారూర్‌లో 10.89 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్, సరూర్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్ మండలాల్లో 8 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జిల్లాలో పలుచోట్ల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
భారీగా పంటనష్టం..!
భారీ వర్షాలతో జిల్లాలో పంటనష్టం జరిగింది. గత వారం వరకు వర్షాభావ పరిస్థితులతో మొక్కలు పూర్తిగా ఎండిపోగా... ప్రస్తుతం భారీ వర్షాలతో ఈ నష్టం మరింత తీవ్రమైంది. కష్టపడి కాపాడిన పంటు చేతికొచ్చే సమయంలో వర్షాలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంటతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నష్టం అంచనాల గుర్తింపు మరో రెండ్రోజుల తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. వర్షాలు తగ్గితే కొంతమేర పంటలు గాడిన పడే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.