ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వేసవి తాపాన్ని తలపించే ఉష్ణ తీవ్రత నుంచి ఉత్తర కోస్తాకు కాస్త ఉపశమనం కలగనుంది. ఈశాన్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం సోమవారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది బలమైన అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడడం వల్ల మన రాష్ట్రానికి ఆశించినంతగా వర్షాలు కురవకపోయినా ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా రికార్డవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇటు ద్రోణి, అటు అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు గాను, రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. కాగా సోమవారం విశాఖలో 2.5 సెం.మీల వర్షపాతం రికార్డయింది.