బాబోయ్ ఇదేం వేడి..
- నిప్పులు కక్కుతున్న వాతావరణం
- అల్లాడుతున్న జిల్లా ప్రజానీకం
- విశాఖలో 36.2 డిగ్రీల ఉష్ణతాపం
సాక్షి, విశాఖపట్నం: భానుడు ఉడుకు పుట్టిస్తున్నాడు. జనాన్ని ఉష్ణతాపంతో బెంబేలెత్తిస్తున్నాడు. వర్షాలు కురిసే కాలంలో ఎండలతో అల్లాడిస్తున్నాడు. జిల్లాలో సాధారణంకంటే మూడు నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం మరింత గా సెగలు కక్కాయి. వాస్తవానికి ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘కొమెన్’ తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వానల స్థానంలో వేసవిని తలపించే ఎండలు కాస్తున్నాయి. శనివారం నగరం (విమానాశ్రయం)లో 36.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇది సాధారణంకంటే మూడు డిగ్రీలు అధికం.
ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వేడి వెద జల్లుతూనే ఉంది. ఆకాశంలో మేఘాల జాడ కూడా లేకపోవడంతో నడినెత్తిపై సూర్యుడు ఉన్న అనుభూతిని పొందారు. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. వివిధ పనులపై వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు. ఉష్ణతాపానికి ఉక్కపోత కూడా తోడైంది. గాలులు కూడా అంతగా లేకపోవడంతో అటు ఎండ వేడి, ఇటు ఉక్కపోతతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆకస్మికంగా క్యుములోనింబస్ మేఘాలు నగరంపై ఆవరించాయి. ఈదురుగాలులు కూడా వీచాయి. అప్పటికప్పుడే కొద్దిపాటి వర్షం కురిసి మాయమైంది. దీంతో రోజంతా ఉష్ణతాపంతో సతమతమైన నగర వాసులు కాసింత ఊరట చెందారు. మరోవైపు మరికొన్ని రోజుల పాటు ఉష్ణతీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అవసరమైన జాగ్రత్తలతో బయటకు వెళ్లాలని వీరు సూచిస్తున్నారు.