వరద గోదారి
వరద గోదారి
Published Sat, Jul 22 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM
నదికి వరద పోటు
4,39,969 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
ఎగువప్రాంతంలో తగ్గుముఖం పట్టిన నీటిమట్టాలు
కొవ్వూరు : గోదావరిలో వరద ఉగ్రరూపం దాల్చింది. దీంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సీజన్‌లోనే అత్య«ధికంగా వరద పోటు తగిలింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో కూడా భారీ వానలు కురవడంతో వరద ముంచెత్తింది. పోలవరం మండలంలోని కాజ్‌వేలపైకి వరద నీరు చేరడంతో 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. యలమంచిలి మండలం కానగాయలంక కాజ్‌వే పై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువున నీటిమట్టాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో మరో ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆరుగంటలకు గరిష్టంగా 5,60,324 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడిచిపెట్టగా సాయంత్రానికి ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గింది. దీంతో ధవళేశ్వరం ఆనకట్టకు నాలుగు ఆర్మ్‌లు వద్ద ఉన్న 175 గేట్లను రెండు మీటర్లు ఎత్తు లేపి 4,39,969 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉదయం నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం సాయంత్రం 36.70 అడుగులకు చేరిన భద్రచలం నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి నెమ్మదిగా తగ్గుతూ 34.40 అడుగులకు చేరింది. శుక్రవారం సాయంత్రం ఆనకట్ట వద్ద నీటిమట్టం 8.70 అడుగులుగా నమోదైంది. ఉభయగోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు నీటివిడుదలను భారీ పెంచారు. మూడు డెల్టాకు 10,400 క్యూసెక్కుల నీరు సాగునీటి అవసరాల నిమిత్తం విడిచిపెడుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తగ్గుతున్న నీటిమట్టాలు
ఎగువున కాలేశ్వరంలో 6.49 మీటర్లు పేరూరులో 9.49, దుమ్ముగూడెం లో 9.76, కూనవరంలో 12.72, కుంటలో 7.22 మీటర్లకు నీటిమట్టాలు తగ్గాయి. పోలవరంలో 10.36 మీటర్ల నుంచి 11.01 మీటర్లకు, రోడ్డు కం రైలు వంతెన వద్ద 14.02 నుంచి 15.19 మీటర్లకు పెరిగాయి. శనివారం సాయంత్రానికి ధవళేశ్వరంలో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
పోలవరంలో..
పోలవరం : గోదావరి వరదనీరు మరింత పెరిగింది. పోలవరంలోని కడెమ్మ స్లూయిస్ వద్ద 1.28 మీటర్లు ఉన్న గోదావరి వరద నీటి మట్టం శుక్రవారం 3.25 మీటర్లకు పెరిగింది. ప్రస్తుతం వరద నిలకడగా ఉన్నప్పటికీ, రెండు రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మండలంలోని కొత్తూరు కాజ్‌వే వరదనీటిలో మునగటంతో కోండ్రుకోట, తూటిగుంట, కొరుటూరు పంచాయతీల పరిధిలోని 19 ఏజెన్సీ గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు మండలంలో దాచారం, గొమ్ముగూడెం పంచాయతీల పరిధిలో దాదాపు 10 గ్రామాలకు రోడ్డు మార్గం మునిగిపోయింది. దీంతో 20 కి.మీ అదనంగా ప్రయాణించి ఆయా గ్రామాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలకు కూడా ఈ రోడ్డుపై నుంచి చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తుంది.
Advertisement