మేడ్చల్: రైళ్లో పుష్కరాలకు వెళ్తున్న ప్రయాణికులకు ...తోటి ప్రయాణికులు చుక్కలు చూపించారు. కొందరు ప్రయాణికులు ముందుగా ట్రైన్ ఎక్కిన అన్ని డోర్స్ మూసివేశారు. ట్రైన్ ఎక్కాల్సిన మిగతా ప్రయాణికులు ఎంత బ్రతిమాలినా డోర్స్ తీయక పోవడంతో గందరగోళం నెలకొంది. ఫలితంగా బాసరకు వెళ్లాల్సిన పుష్కర స్పెషల్ ట్రైన్ 40 నిముషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ సంఘటన శనివారం మేడ్చల్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళ్తే గోదావరి పుష్కరాల కోసం దక్షిణమధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పుష్కరాలు ప్రారంభం అయిన నాటి నుండి రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా వారాంతం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇసుకేస్తే రాలనంతగా రైళ్లు కిక్కిరిసి పోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా శనివారం మల్కాజ్ గిరి నుండి ఉదయం ఆరున్నర గంటలకు ఏర్పాటు చేసిన పుష్కర స్పెషల్ ట్రైన్ మేడ్చల్ స్టేషన్ చేరుకోగా, రైలు డోర్స్ మూసి ఉంచి కనిపించటం ప్రయాణికులని కలవర పెట్టింది.
ప్రయాణికులు తలుపులు తీయండని బ్రతిమాలిన లోపల ఉన్న ప్రయాణికులు కనికరించలేదు. దీంతో కొందరు రైలు డోర్స్ పగలగొట్టే ప్రయత్నం చేశారు. తాము ఎక్కేంత వరకూ ట్రైన్ కదిలించవద్దని, సిగ్నల్ ఇస్తే ఊరుకోమని ఇతర ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ పై విరుచుకు పడ్డారు. డోర్స్ తెరిపించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ మాస్టర్ చెప్పినా లోపల ప్రయాణికులు డోర్స్ తీయకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చివరకు అరగంటకు పైగా ప్రయాసపడిన తర్వాత ప్రయాణికులు రైలులో ఎక్కారు. అయినా రైలులో రద్దీ ఉండటంతో చాలా మంది ప్రయాణికులు ఫ్లాట్ ఫాంపైనే ఉండిపోయారు.