పుష్కరాలకు భారీ బందోబస్తు
పుష్కరాలకు భారీ బందోబస్తు
Published Fri, Aug 5 2016 6:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
సందర్భంగా మట్టపల్లి వద్ద 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు హుజూర్‌నగర్ సీఐ వి.నర్సింహారెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరుగుతుండడంతో మట్టపల్లిలో ఇప్పటికే 11 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడంలో పోలీసుల పాత్ర కీలకం. జిల్లాలోని వాడపల్లి, నాగార్జునసాగర్‌తో పాటు మట్టపల్లికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోనే ప్రధాన పుష్కర ఘాట్లలో ఒకటైన మట్టపల్లిలో కీలక విధులు నిర్వహించనున్న హుజూర్‌నగర్ సీఐ వి.నర్సింహారెడ్డి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే...
బందోబస్తు పనులు పూర్తి
హుజూర్‌నగర్ సర్కిల్ పరిధిలో మట్టపల్లి, నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్లు ముఖ్యమైనవి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐదు పుష్కర ఘాట్ల వద్ద బందోబస్తు, రూట్ మ్యాప్‌ల విషయమై సంబంధిత అధికారులు ఇప్పటికే పనులు పూర్తి చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేశాం.
భారీ బందోబస్తు ఏర్పాట్లు
పుష్కర ఘాట్ల నుంచి ఆయా రహదారులు, పార్కింగ్ స్థలాల వద్ద ఇద్దరు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 100 మంది ఎస్‌ఐలతో పాటు 1500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు 600 మంది ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సైతం పుష్కర విధుల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం, సైబరాబాద్ నుంచి పోలీస్ అధికారులు, సిబ్బంది రానున్నారు. ప్రతిరోజు మూడు దఫాలుగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిబ్బంది విధి నిర్వహణలో పాల్గొంటారు.
65 సీసీ కెమెరాల ఏర్పాటు
పుష్కర ఘాట్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు 65 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మట్టపల్లి పుష్కర ఘాట్లు, పరిసర ప్రాంతాల్లో 50, మహంకాళిగూడెం ఘాట్ వద్ద 15 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నాం.
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు
మట్టపల్లికి వచ్చే వాహనాలతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం మఠంపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని బైపాస్ నుంచి రఘునాథపాలెం, గుండ్లపహాడ్, పాత సుల్తాన్‌పూర్ తండాల మీదుగా ఎన్‌సీఎల్ పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలానికి చేరుకునే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశాం. అక్కడి నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో భక్తులను ఘాట్ల వద్దకు చేరవేస్తారు. పుష్కర స్నానం ముగించుకొని ఎన్‌సీఎల్ పరిశ్రమ వద్ద గల పార్కింగ్ స్థలానికి చేరుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో నేరుగా ప్రధాన రహదారికి వెళ్లే అవకాశం కల్పించాం. కోదాడ రోడ్డు మీదుగా హుజూర్‌నగర్ వచ్చే వాహనాలు ముక్త్యాల మేజర్ వెంట గల బైపాస్ రోడ్డు మీదుగా మట్టపల్లి వెళ్లే విధంగా, మిర్యాలగూడ రోడ్డు నుంచి హుజూర్‌నగర్‌కు వచ్చే వాహనాలను పట్టణం నుంచి మట్టపల్లి వెళ్లేందుకు అనుమతిస్తున్నాం.
వీఐపీ పాస్‌ల జారీ అధికారం కలెక్టర్, ఎస్పీలదే..
వీఐపీ పాస్‌ల జారీ విషయంలో తమకెలాంటి అధికారాలు లేవు. కలెక్టర్, ఎస్పీలు మాత్రమే వీఐపీ పాస్‌లను జారీ చేస్తారు.
Advertisement