
గజిబిజి
- పురంలో భారీగా ట్రాఫిక్ బెడద
- బారులు తీరుతున్న వాహనాలు
హిందూపురం అర్బన్: పెరుగుతున్న జనాభా.. వెడల్పు లేని రహదారులు.. కిక్కిరిసిన వాహనాల మధ్యనే ప్రజల రాకపోకలు.. రోడ్లపైనే వ్యాపారాలు.. ఇరువైపులా తోపుడుబండ్లు.. ఇలా తరచూ హిందూపురంలో ట్రాఫిక్ బెడద ప్రజలను వేధిస్తోంది. వాహనాల రద్దీతో ప్రజలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో 1.60 లక్షల జనాభా ఉండగా సుమారు 40 లక్షల పైగా ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. దీనికి తోడు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాల రాకపోకల కారణంగా రహదారులన్నీ గంగరగోళంగా మారుతున్నాయి. ఉదయం కార్యాలయాలు, స్కూల్ వేళల్లో, మ«ధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ప్రణాళికబద్ధంగా వ్యవహరించినా సమస్య తీరడం లేదు.
ఈ ప్రదేశాల్లోనే ట్రాఫిక్
అంబేడ్కర్‌సర్కిల్, మూడురోడ్ల కూడలి, పరిగి రోడ్డు, సద్భావన సర్కిల్, ఆర్‌పీజీటీ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, చర్చి రోడ్డు, పాతమార్కెట్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీసర్కిల్, ఎంఎఫ్ రోడ్డు, బెంగళూరు రోడ్డు, గురునాథ్ సర్కిల్, ఎస్‌బీఐ సర్కిల్, డీఎల్ రోడ్డు, మెయిన్‌బజారు, రహమత్‌పురం సర్కిల్ ఏరియాల్లో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి.
కారణాలు ఇవే..
- వెడల్పు లేని రహదారులు. పెరిగిన జనాభా. వాహనాల రాకపోకలకు అనుగుణంగా మున్సిపల్ అధికారులు, పాలకులు రోడ్ల విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- రోడ్ల విస్తరణ పేరిట మెయిన్‌బజారు, ఎంఎఫ్ రోడ్డు, సద్భావన సర్కిల్ వద్ద ఇరువైపులా కొంత సిమెంట్ ప్లాట్‌ఫారాలు నిర్మించారు. అయితే వ్యాపారులు, బండ్ల వ్యాపారులకు సౌకర్యంగా మారింది.
- రైల్వే రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు దశాబ్దాల కాలం నుంచి ప్రణాళికలు వేస్తున్నారు తప్ప ఎలాంటి కార్యచరణకు నోచుకోలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం రహదారులకు మహర్దశ పడుతుందని ప్రజలు భావించినా నిరాశే మిగిలింది.
సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి : శ్రీరాములు, న్యాయవాది
పట్టణంలో జనాభాతో పాటు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. తరచూ ట్రాïఫిక్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని కూడా పెంచాలి. అదేవిధంగా రహదారులు వెడల్పు చేయాలి.
ప్రతిపాదనలు పంపించాం : ఈదూర్‌బాషా, సీఐ, హిందూపురం
ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు అవసరమైన సిబ్బంది పెంచాలని, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఉన్న సిబ్బందితో ప్రతిరోజు రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నాం.