హెల్మెట్ తప్పనిసరి!
నిజామాబాద్ క్రైం : ‘‘హెల్మెట్ ధరించని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జరిమానాలు విధించండి.. ప్రభుత్వ కార్యాలయాల ముందు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించండి.. హెల్మెట్ ధరించని వారిని కార్యాలయాల్లోకి అనుమతించకండి..’’ రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ ఎస్పీ విశ్వప్రసాద్‌తో కలిసి వారం క్రితం ప్రత్యేక సమావేశం నిర్వహించి ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశానుసారం మంగళవారం నుంచి హెల్మెట్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు..
హెల్మెట్ ఉంటేనే విధులకు అనుమతి...
హెల్మెట్ ధరించకుండా వాహనంపై వచ్చిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని వారి కార్యాలయం ముందే అడ్డుకోవాలని, వారికి జరిమానాలు విధించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ లేకుండా బైక్‌పై కార్యాలయానికి వచ్చిన డీఆర్‌వో, ఆర్‌డీవోలకు సైతం జరిమానాలు విధించాలని ఆదేశించారంటే ఏ మేరకు నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నారో స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ద్విచక్ర వాహనం కలిగిన ప్రతి ఒక్కరు ఇకపై ఖచ్చితంగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవానికి హెల్మెట్ నిబంధనలు గత సంవత్సరం ఏప్రిల్ నుంచే అమలు చేశారు. మొదట్లో హెల్మెట్లు ధరించని వారిపై నామమాత్ర జరిమానాలతో సరిపెట్టారు. దీంతో ఈ నిబంధనలు తూతూ మంత్రంగా అమలయ్యాయి. మొదట్లో హెల్మెట్లు ధరించటానికి వాహనదారులు క్రమేణా అలవాటు పడుతున్న సమయంలో అధికారులు పట్టించుకోవడంతో షరా మామూలుగా మారింది. దీంతో అప్పటి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి హెల్మెట్ ధరించని వారిపై ఇక నుంచి రూ. 500 తక్కువ కాకుండా జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీచేశారు. వీటిని అమలుపరిచే సమయంలో ఆయన మెదక్‌కు బదిలీ అయ్యారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు నామా మాత్రంగానే వాహనాలు తనిఖీ చేస్తూ వచ్చారు. ఇటీవల కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి హెల్మెట్ నిబంధనలను ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులను సైతం వదిలేది లేదంటూ, కఠినంగా చర్యలు తీసుకోవాలని గట్టిగానే ఆదేశించారు. మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ సీఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.
హెల్మెట్ ధరించిన వారికే పెట్రోల్..
హెల్మెట్ ధరించని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడికి జరిమానాలు విధించటం కుదరని పని. అందుకు పోలీసు యంత్రాంగం కొన్ని బాధ్యతలు పెట్రోల్ బంక్‌ల వారికి అప్పగించనుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టడం గమనించిన కొందరు తప్పించుకు తిరుగుతున్నారు. అదే పెట్రోల్ కోసం కచ్చితంగా బంక్‌కు వస్తారు.. కాబట్టి హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని బంకు యజమానులకు ఆదేశాలు జారీ చేయనునున్నారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని, లేకపోతే సదరు బంక్ యజమానికి భారీగా జరిమానా విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద పోలీస్ సిబ్బందితో నిఘా పెట్టనున్నారు. ఈ నిబంధనలు జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు హెల్మెట్లు ధరించని 12,500 మందిపై కేసులు నమోదు చేసి, దాదాపు రూ. 24 లక్షలు జరిమానాల రూపంలో వసూలు చేశారు.