క్రీడా పరికరాలు అందిస్తున్న జగన్
అ‘పూర్వ’సాయం..!
Published Sat, Aug 20 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా అమెరికాలో స్థిరపడినా... తమకు భవిష్యత్‌ను ఇచ్చిన పాఠశాలను మరువలేదు. తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పదేళ్లుగా పాఠశాల అభివృద్ధిగా భాగస్వాములవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే... మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు లెంక విజయభాస్కర్, జగన్‌లు. వీరి సేవలను ఓ సారి పరికిస్తే...
సంతకవిటి: మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న మందరాడ గ్రామానికి చెందిన లెంక విజయ్‌భాస్కర్, లెంక జగన్‌లు అన్నదమ్ములు. స్థానిక పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. గ్రామానికి దూరంగా నివసిస్తున్నా గ్రామం, పాఠశాలపై మమకారం వీడలేదు. తమ ఉన్నతికి కారణమైన పాఠశాల బాగుకోసం నడుంబిగించారు. పదేళ్లుగా పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తున్నారు.
ఎన్నో కార్యక్రమాలు...
–పాఠశాల విద్యార్థులకు బెంచీల సదుపాయం కల్పించారు. వసతి సమస్య పరిష్కారం కోసం రెండు షెడ్లు నిర్మించారు.
–వ్యాయామ ఉపాధ్యాయుడు కె.సన్నిబాబు విజ్ఞప్తి మేరకు విద్యార్థులకు ఏటా క్రీడా దుస్తులను అందజేస్తున్నారు. ఏడాది కిందట పాఠశాలలో గ్రిగ్స్ పోటీల నిర్వహణకు అయిన రూ.2లక్షల ఖర్చును భరించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సాయం చేస్తున్నారు.
– ప్రస్తుతం పాఠశాలలోని క్రీడాకారులుకు రూ.20 వేలు విలువచేసే క్రీడాపరికరాలను పీడీ కె.సన్నిబాబు చేతుల మీదుగా పాఠశాల హెచ్‌ఎం యాగాటి దుర్గారావుకు పూర్వవిద్యార్థి లెంక జగన్ శనివారం అందజేశారు. జావెలిన్ త్రో, డిస్క్, వాలీబాల్, క్రికెట్‌కిట్ వంటి పరికరాలు సమకూర్చారు.
–పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చేయూతనందిస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులందరూ మంచిగా చదువుకోవాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
Advertisement